మైండ్ ట్రీని చేజిక్కించుకోబోతున్న ఎల్ అండ్ టి

మైండ్ ట్రీని చేజిక్కించుకోబోతున్న ఎల్ అండ్ టి

దేశ కార్పొరేట్ చరిత్రలో మొట్టమొదటిసారి ఓ హోస్టైల్ టేకోవర్ జరగబోతోంది. అంటే ప్రమోటర్లకు ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా మైండ్ ట్రీ అనే మిడ్ సైజ్ ఐటీ సంస్థను సొంతం చేసుకునేందుకి సిద్ధమైంది ఎల్ అండ్ టి. ఇలాంటి టేకోవర్లు విదేశాల్లో కామన్ కానీ ఇండియాలో మాత్రం ఇప్పటివరకూ లిస్టెడ్ స్పేస్‌లో లేవు. సెబీ తాజా నిబంధనల్లోని కొన్ని లొసుగులను ఆధారంగా చేసుకుని ఎల్ అండ్ టి సంస్థ ఇందుకు సిద్ధమైంది.

ఎలా కొనింది ?
మీకు అత్తారింటికి దారేది సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో ప్రమోటర్ల స్టేక్‌ను ఇష్టం లేకపోయినా వేరే వాళ్లు కొనాలనుకునే సీన్ ఒకటుంటుంది. ఇప్పుడు కూడా అలాంటిదే మన దేశ కార్పొరేట్ చరిత్రలో జరిగింది. మైండ్ ట్రీ అనేది ఓ మిడ్ సైజ్ ఐటీ సంస్థ. దీన్ని ప్రొఫెషనల్స్ రన్ చేస్తున్నారు. అయితే వాళ్లకు ఈ కంపెనీలో 13.32 శాతం మాత్రమే వాటా ఉంది. మిగిలిన వాటాలు జనాలు, ఇన్వెస్టర్ల దగ్గర ఉన్నాయి. కెఫే కాఫీడే సంస్థ ప్రమోటర్ విజి సిద్ధార్థ దగ్గర 20.41 శాతం వాటా ఉంది. కంపెనీ ఏర్పాటు చేసిన మొదట్లో ఆయన మైండ్ ట్రీలో వాటా కొన్నారు. ఇప్పుడు కాఫీ డే అప్పుల్లో ఉండడంతో మైండ్ ట్రీ వాటాలను ఆయన అమ్మాలని నిర్ణయించుకున్నారు. దీన్నే అవకాశంగా భావించిన ఎల్ అండ్ టి సంస్థ సదరు వాటాలను రూ.3269 కోట్లకు కొనుగోలు చేసింది. వీటికి అదనంగా ఓపెన్ మార్కెట్ ద్వారా 15 శాతం షేర్లను, బైబ్యాక్ ఆఫర్ ద్వారా మరో మరో 31 శాతం వాటాలను  కొనేందుకు ప్లాన్ రెడీ చేసుకుంది. ఇందుకోసం మొత్తం రూ.10733 కోట్లను వెచ్చించబోతోంది. వివిధ మార్గాల ద్వారా మైండ్ ట్రీలో 66-67 శాతం కొనాలనేది ఎల్ అండ్ టి ప్లాన్. కంపెనీలో మెజార్టీ వాటా దక్కిన తర్వాత బోర్డ్ నిర్ణయాలను ప్రభావితం చేయడంతోపాటు ఎల్ అండ్ టి ఇన్ఫోటెక్‌తో కలిసి సినర్జీ ఏర్పాటు చేసుకోవచ్చని భావిస్తోంది. 

దేశంలో మొదటిసారి 
దేశంలో మొట్టమొదటిసారి జరిగిన ఈ తరహా బలవంతపు టేకోవర్‌పై ఐటీ రంగమంతా ఆశ్చర్యంగా చూస్తోంది. ఉద్యోగులు, షేర్ హోల్డర్లు ఇబ్బందిపడ్తారని, కంపెనీ పాలసీ కూడా మారిపోతుందని మైండ్ ట్రీ పదేపదే చెబ్తోంది. షేర్ హోల్డర్లు తమకు సపోర్ట్ చేయాలని మైండ్ ట్రీ ప్రమోటర్లు కోరుతున్నారు. విలీనం తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే మైండ్ ట్రీ ఓనర్లతో ఫ్రెండ్లీగా కొనసాగుతామని, దీనిపై అంత రాద్ధాంతం అవసరం లేదని ఎల్ అండ్ టి కవర్ చేసుకుంటోంది. 

ఏ షేర్‌పై ఎంత ప్రభావం 
ఎల్ అండ్ టి దూకుడు నేపధ్యంలో స్టాక్ 1.5 శాతం నీరసించి రూ.1358 దగ్గర ట్రేడవుతోంది. అయితే ఎల్ అండ్ టి ఇన్ఫోటెక్     మాత్రం ఫ్లాట్‌గా అర శాతం లాభాలతో రూ.1573 దగ్గర కొనసాగుతోంది. టేకోవర్ టార్గెట్ సంస్థ అయిన మైండ్ ట్రీ మాత్రం 1.6 శాతం తగ్గి రూ.947 దగ్గర ఉంది. 
విజి సిద్ధార్థ్‌కు చెందిన కెఫే కాఫీడే సంస్థకు అప్పులు తీరడంతో పాటు ఇకపై ప్రమోటర్ ఈ వ్యాపారంపై దృష్టి పెంచేందుకు ఆస్కారం ఉందని మార్కెట్ వర్గాలు లెక్కగడ్తున్నాయి. అయినా ఈ స్టాక్ 2.5 శాతం తగ్గి రూ.302 దగ్గర ట్రేడవుతోంది. 

 

 Most Popular