భారీ ట్రేడింగ్‌- రేసు గుర్రాలీ షేర్లు

భారీ ట్రేడింగ్‌- రేసు గుర్రాలీ షేర్లు

వారం రోజులుగా లాభాల దుమ్మురేపుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు ప్రస్తుతం కొంతమేర కన్సాలిడేషన్‌ బాటపట్టినప్పటికీ కొన్ని కౌంటర్లు ఇన్వెస్టర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం భారీగా పెరిగింది. జాబితాలో పీఎస్‌యూ దిగ్గజం హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌, రియల్టీ సంస్థ బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తదితరాలున్నాయి. వివరాలు చూద్దాం...

హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌: వాటాదారులకు తాజాగా ఒక్కో షేరుకీ రూ. 19.80 చొప్పున భారీ డివిడెండ్‌ను ప్రకటించింది. ఇందుకు మార్చి 29 రికార్డ్‌ డేట్‌గా ప్రకటించింది. దీంతో ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 700కు చేరింది. ఇంట్రాడేలో రూ. 718 వరకూ దూసుకెళ్లింది. ఈ కౌంటర్‌లో ట్రేడింగ్‌ పరిమాణం గత 20 రోజుల సగటుతో పోలిస్తే 5 రెట్లు ఎగసింది. 

బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌: నేటి ట్రేడింగ్‌లో రియల్ ఎస్టేట్‌ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో రియల్టీ సంస్థ బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్లో ట్రేడింగ్‌ పరిమాణం గత 20 రోజుల సగటుతో పోలిస్తే 10 రెట్లు ఎగసింది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 7 శాతం దూసుకెళ్లి రూ. 243కు చేరింది. ఇంట్రాడేలో రూ. 259 వరకూ ఎగసింది.

కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌: ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ మైండ్‌ట్రీలో వాటా విక్రయ అంశం నేపథ్యంలో ఈ కౌంటర్‌ జోరందుకుంది. కాఫీ డే ప్రమోటర్‌ సిద్ధార్ద వాటా విక్రయ ప్రణాళికల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ కౌంటర్లో ట్రేడింగ్‌ పరిమాణం గత 20 రోజుల సగటుతో పోలిస్తే 4 రెట్లు ఎగసింది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3.2 శాతం పెరిగి రూ. 310కు చేరింది. ఇంట్రాడేలో రూ. 318 వరకూ జంప్‌చేసింది.

స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌: ఇటీవల కొద్ది రోజులుగా చైనా నుంచి ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్లకు డిమాండ్‌ తగ్గడంతోపాటు, ధరలు క్షీణించడం వంటి పరిస్థితులు ఈ వేదాంతా గ్రూప్‌ సంస్థలో అమ్మకాలకు కారణమవుతున్నాయి. ఈ బాటలో తాజాగా  ఎన్‌ఎస్‌ఈలో స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ షేరు 5.5 శాతం పతనమై రూ. 219కు చేరింది. ఇంట్రాడేలో రూ. 216 వరకూ క్షీణించింది.ఈ కౌంటర్లో ట్రేడింగ్‌ పరిమాణం గత 20 రోజుల సగటుతో పోలిస్తే 5 రెట్లు ఎగసింది. Most Popular