ఎంబసీ రీట్స్ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయొచ్చా ? రిటైల్ ఇన్వెస్టర్లకు లాభముందా

ఎంబసీ రీట్స్ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయొచ్చా ? రిటైల్ ఇన్వెస్టర్లకు లాభముందా

ఎంబసీ రీట్స్ ఐపీఓ నేటి నుంచి మార్కెట్‌లో అడుగుపెట్టబోతోంది. ఇది దేశంలో మొట్టమొదటి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ కావడంతో ఆసక్తితో పాటు ఎన్నో అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ ఐపీఓ ద్వారా రూ.4750 కోట్లను సమీకరించబోతున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థల్లో ఒకటైన బ్లాక్‌స్టోన్‌తో కలిసి బెంగళూరు సంస్థ ఎంబసీ ఈ ఐపీఓను ఆఫర్ చేస్తోంది. ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. 

ఏంటీ రీట్స్..
రియల్ ఎస్టేట్. ఇది భారతీయులకు చాలా ఇష్టమైన పెట్టుబడి. ప్రతీ ఒక్కరూ ఇందులో ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసి లాభాలను పొందాలని చూస్తారు. అయితే ఇక్కడ రెసిడెన్షియల్ వేరు, కమర్షియల్ వేరు. కమర్షియల్ ప్రాపర్టీలో లాభాలు ఎక్కువే ఉంటాయి కానీ ఇందుకోసం భారీగా నిధులు అవసరం. ఒక సాధారణ రిటైల్ ఇన్వెస్టర్ కోట్లకు కోట్లు పెట్టుబడులు కుమ్మరించడం కష్టమవుతుంది. అందుకే అలాంటి వాళ్ల కోసమే ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ పుట్టుకొచ్చాయి.  మ్యూచువల్ ఫండ్స్ మాదిరే ఇక్కడ కూడా ఎక్కువ మంది ఇన్వెస్టర్ల నుంచి డబ్బులు సమీకరించి దాన్ని కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. వాటి ద్వారా వచ్చే రెంటల్ ఇన్‌కంను డివిడెండ్ రూపంలో ఇన్వెస్టర్లకు పంచుతారు. వీటికి అదనంగా ప్రాపర్టీ ప్రైస్ అప్రియేషన్‌ కూడా వస్తుంది కాబట్టి ఇది అడిషనల్ బోనస్ లాంటిది. ఇదీ సింపుల్‌గా రీట్స్ అంటే. 

ఎంబసీ ఐపీఓ
ఎంబసీ ప్రాపర్టీ డెవలప్‌మెంట్ సంస్థకు దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ రీట్స్‌లో భాగంగా ఏడు ఆఫీస్ పార్కులు, నాలుగు ఆఫీస్ బిల్డింగ్స్ ఉన్నాయి. మొత్తం 3.26 కోట్ల స్క్వేర్ ఫీట్‌ను అద్దెకు ఇచ్చారు. ఈ ప్రాపర్టీస్ విలువ రూ.34 వేల కోట్లు. బెంగళూరులో వీళ్లకు అధికంగా (60 శాతం) ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ తర్వాత ముంబై (16 శాతం), పూణే (14.4 శాతం), నోయిడా (8.9 శాతం)లో కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి.   
ఉన్న ప్రాపర్టీస్‌లో టాప్ క్లాస్ క్లయింట్స్ అయిన జెపి మోర్గాన్, గూగుల్, ఐపీఓ, మెకెన్సీ, నోకియా, డిబిఎస్ వంటి 160 సంస్థలున్నాయి. 

ప్రమోటర్లు ఈ ఇన్వెస్ట్‌మెంట్‌కు డివిడెండ్స్ రూపంలో 8.25 శాతం ఈల్డ్స్ (రిటర్న్స్) రావొచ్చని అంచనా కడ్తున్నారు. 
సెబీ సూచనల ప్రకారం ఆరునెలలకు ఓసారి వడ్డీని ప్రమోటర్ సంస్థ చెల్లించాల్సి ఉంటుంది. 

యాంకర్ ఇన్వెస్టర్ల ఆసక్తి
ఈ ఐపీఓకు స్ట్రాటజిక్ పార్ట్‌నర్స్, యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పటికే 55 శాతం సబ్‌స్క్రిప్షన్ పూర్తైంది. 

రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రయోజనం ఉందా
ఇది సాధారణ ఐపీఓ మాదిరి కాదు. ఈ రీట్స్‌లో కనీసం 800 యూనిట్స్‌కు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. వీళ్ల ప్రైస్ బ్యాండ్ రూ.299-300. ఈ లెక్కన రూ.2.39- 2.40 లక్షలు ఖర్చవుతుంది. ఈ స్థాయిలో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టగలరా లేదా అని చూడాలి. 
ప్రస్తుతం దేశంలో కమర్షియల్ రియల్ ఎస్టేట్‌పై రెంటల్ ఈల్డ్ 8-9.5 శాతం మధ్య ఉంది. వీటికి అదనంగా క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా ఉంటుంది. దీర్ఘకాలంలో అంటే కనీసం నాలుగైదేళ్లు వేచి చూసే కెపాసిటీ ఉంటే అప్పుడు 12-14 శాతం వరకూ రిటర్న్స్ వర్కవుట్ కావొచ్చని నిపుణులు అంచనా కడ్తున్నారు. 
క్రమంతప్పకుండా రిటర్న్స్ ఆశించే వాళ్లకు ఇది కొద్దిగా ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ వంటి వాళ్లకు కొద్దో గొప్పో బెటర్. ఎందుకంటే ఆరు నెలలకు ఓ సారి డివిడెండ్స్ రూపంలో రిటర్న్స్ వస్తాయి. ఇవి కూడా ట్యాక్స్ ఫ్రీ. ఫిక్సెడ్ డిపాజిట్లకు ఇది ప్రత్యామ్నాయం కాదు కానీ..  పెట్టుబడితో కొంత మొత్తాన్ని వీటిల్లో పెట్టొచ్చు. ఇప్పుడిప్పుడే దేశంలో ప్రారంభమైన కొత్త ట్రెండ్ కాబట్టి ఎలా ఉంటుందో అప్పుడే చెప్పడం కష్టం. అభివృద్ధి చెందిన మార్కెట్లలో ఇది చాలా సాధారణమైన పెట్టుబడి. అక్కడ బాగా ప్రాచుర్యం పొందిన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ కూడా. 

గతేడాది విదేశీ సంస్థాగత సంస్థలైన జపాన్ నిక్కోయామ్ - స్ట్రెయిట్స్ ట్రేడింగ్ ఏషియా, యూఎస్‌కు చెందిన నార్త్ కెరోలినా ఫండ్‌  సెబీ నుంచి రీట్స్ కోసం అనుమతులు పొందాయి. 

- నాగేంద్ర సాయిMost Popular