మైండ్‌ట్రీ- టేకోవర్‌కు బైబ్యాక్‌తో చెక్‌?

మైండ్‌ట్రీ- టేకోవర్‌కు బైబ్యాక్‌తో చెక్‌?

సాఫ్ట్‌వేర్‌ సేవల మధ్యస్థాయి కంపెనీ మైండ్‌ట్రీ లిమిటెడ్‌ తాజాగా సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చింది. ఈ అంశంపై చర్చించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల 20న సమావేశంకానున్నట్లు తెలియజేసింది. కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్ద మైండ్‌ట్రీలో 21 శాతం వాటా కలిగి ఉన్నారు. ఈ వాటాను విక్రయించేందుకు ఇటీవల సిద్ధార్ద పావులు కదుపుతూ వస్తున్నారు. సిద్ధార్ద వాటాను కొనుగోలు చేసేందుకు ఇప్పటికే ఇంజినీరింగ్‌ దిగ్గజం లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌అండ్‌టీ) ఆసక్తిని ప్రదర్శించడం గమనార్హం. 

నాయక్‌ కన్ను
జనవరిలో ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ ఏఎం నాయక్‌ మైండ్‌ట్రీలో వాటా కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఎల్‌అండ్‌టీకి సాఫ్ట్‌వేర్‌ సేవల విభాగంలో రెండు అనుబంధ కంపెనీలున్న విషయం విదితమే. ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌ ద్వారా ఇంజినీరింగ్‌ దిగ్గజం ఐటీ సేవలు అందిస్తోంది. కాగా.. మైండ్‌ట్రీలో ప్రమోటర్లకు 13.32 శాతం వాటా మాత్రమే ఉంది. ప్రమోటర్లుకాకుండా కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా సిద్ధార్ద నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో మైండ్‌ట్రీలో వాటాను ఎల్‌అండ్‌టీ కొనుగోలు చేయడం ద్వారా బోర్డులో సీటును పొందే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

Related image

రూ. 1,000 కోట్లు
ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు మైండ్‌ట్రీ రూ. 1,000 కోట్లవరకూ వెచ్చించే అవకాశమున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఇంతక్రితం కంపెనీ 2017లో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను చేపట్టింది. ఇందుకు రూ. 270 కోట్లను వెచ్చించింది. టేకోవర్ ప్రయత్నాలకు చెక్‌ పెట్టే యోచనతో ప్రమోటర్లు తాజా బైబ్యాక్‌ ప్రతిపాదన తీసుకువచ్చి ఉంటారని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు దీర్ఘకాలంగా కంపెనీలో ఇన్వెస్ట్‌చేస్తున్న వాటాదారులకు బైబ్యాక్‌ ద్వారా రివార్డ్‌ అందించాలని మైండ్‌ట్రీ యాజమాన్యం భావిస్తున్నట్లు మరికొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు.

షేరు తీరిలా
శుక్రవారం(15న) ఎన్‌ఎస్‌ఈలో మైండ్‌ట్రీ లిమిటెడ్‌ షేరు నామమాత్ర నష్టంతో రూ. 947 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 965-947 మధ్య ఊగిసలాడింది. ఈ షేరు 2018 సెప్టెంబర్‌ 18న రూ. 1184 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకగా.. అదే ఏడాది మార్చి 23న రూ. 745 వద్ద 52 వారాల కనిష్టానికి చేరింది.Most Popular