15 ఏళ్ల తదుపరి ఎన్ని'కల ర్యాలీ!

15 ఏళ్ల తదుపరి ఎన్ని'కల ర్యాలీ!

సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడ్డాక జోరందుకున్న దేశీ స్టాక్ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో వరుసగా ఐదో రోజు మార్కెట్లు లాభపడ్డాయి. గత దశాబ్దన్నర కాలంలో ఇలా జరగడం ఇదే తొలిసారికావడం విశేషం! ట్రేడింగ్ ప్రారంభంలోనే లాభాల సెంచరీ చేసిన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 500 పాయింట్లు జంప్‌చేసింది. 38,250ను తాకింది. ఫలితంగా 2018 సెప్టెంబర్ 14 తదుపరి తిరిగి 38,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. తద్వారా 2019లో మార్కెట్లు కొత్త గరిష్టాలకు చేరినట్లయ్యింది. కాగా.. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్‌ 269 పాయింట్లు లాభపడి 38,024 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 84 పాయింట్లు ఎగసి 11,427 వద్ద స్థిరపడింది. 

కనిష్టం నుంచి దూకుడు
గత నెల 19న నమోదైన కనిష్టం 35,353 నుంచి సెన్సెక్స్‌ తాజాగా 2900 పాయింట్లు(8 శాతం) దూసుకెళ్లింది. ఇదే సమయంలో దేశీ కేపిటల్‌ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 30,537 కోట్లను ఇన్వెస్ట్‌ చేయడంతో మార్కెట్లకు హుషారొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. 

ఎఫ్‌ఎంసీజీ నేలచూపు
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా బ్యాంక్‌ నిఫ్టీ, ఐటీ దాదాపు 2 శాతం చొప్పున ఎగశాయి. ఎఫ్‌ఎంసీజీ 1.7 శాతం క్షీణించింది. నిఫ్టీ దిగ్గజాలలో కొటక్‌ బ్యాంక్‌, ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌, పవర్‌గ్రిడ్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, యూపీఎల్‌, గెయిల్‌, ఐసీఐసీఐ 5-2 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే హెచ్‌యూఎల్‌, యస్‌బ్యాంక్‌, ఆర్‌ఐఎల్‌, ఐటీసీ, ఎయిర్‌టెల్‌, అల్ట్రాటెక్‌, గ్రాసిమ్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, హీరో మోటో 2-0.6 శాతం మధ్య నీరసించాయి.

చిన్న షేర్లు అటూఇటూ
మార్కెట్లు హుషారుగా ముగిసినప్పటికీ చిన్న షేర్లలో అమ్మకాలు నమోదయ్యాయి. దీంతో బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 0.55 శాతం పుంజుకోగా, స్మాల్‌ క్యాప్‌ 0.4 శాతం బలహీనపడింది. ట్రేడైన మొత్తం షేర్లలో 1208 లాభపడగా.. కేవలం 1476 నష్టాలతో ముగిశాయి.

ఎఫ్‌పీఐల పెట్టుబడుల దన్ను
నగదు విభాగంలో బుధవారం రూ. 2,722 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గురువారం మరోసారి రూ. 1483 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. కాగా.. బుధవారం రూ. 1508 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న దేశీ ఫండ్స్‌(డీఐఐలు) గురువారం సైతం రూ. 818 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి.Most Popular