రియల్టీ, మెటల్‌ అప్‌- ఐటీ, ఆటో డౌన్‌

రియల్టీ, మెటల్‌ అప్‌- ఐటీ, ఆటో డౌన్‌

వరుసగా మూడో రోజులపాటు ర్యాలీ బాటలో సాగిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి కన్సాలిడేషన్‌ బాటపట్టాయి. ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇవ్వడంతో స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదిలాయి. చివరికి ఎక్కడివారక్కడే గప్‌చుప్‌ అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్‌ 3 పాయింట్ల నామమాత్ర లాభంతో 37,755 వద్ద నిలవగా.. నిఫ్టీ సైతం 2 పాయింట్లు బలపడి 11,345 వద్ద స్థిరపడింది. అయితే ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు ప్రారంభంలో కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సెన్సెక్స్‌ లాభాల సెంచరీ సాధించింది. 37,907 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. తదుపరి ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో అక్కడక్కడే అన్నట్లుగా ముగిసింది.

రియల్టీ జోరు- అడాగ్‌ వీక్‌
ఎన్‌ఎస్ఈలో రియల్టీ 2.2 శాతం ఎగసింది. ఫార్మా 1 శాతం, మెటల్‌ 0.6 శాతం చొప్పున పుంజుకోగా.. ఐటీ, ఆటో 0.5 శాతం చొప్పున క్షీణించాయి. రియల్టీ స్టాక్స్‌లో ఫీనిక్స్‌, ఇండియాబుల్స్‌, డీఎల్‌ఎఫ్‌ 7.5-5 శాతం మధ్య జంప్‌చేశాయి. ఈ బాటలో ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, సన్‌టెక్‌ సైతం 1.6 శాతం చొప్పున ఎగశాయి. కాగా.. నిఫ్టీ దిగ్గజాలలో ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్, ఎయిర్‌టెల్‌, యస్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, కోల్‌ ఇండియా, గ్రాసిమ్‌, ఐవోసీ,  ఓఎన్‌జీసీ, గెయిల్‌ 3.6-1.4 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే  హెచ్‌సీఎల్‌ టెక్‌, అల్ట్రాటెక్‌, హీరో మోటో, టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ, యూపీఎల్‌, హిందాల్కో, ఐషర్‌, పవర్‌గ్రిడ్‌, ఆర్‌ఐఎల్‌ 2.2-0.6 శాతం మధ్య క్షీణించాయి.

అడాగ్‌ షేర్లు బోర్లా
హుషారుగా ప్రారంభమైన మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాట పట్టడంతో మిడ్‌క్యాప్స్‌లో అమ్మకాలు నమోదయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.25 శాతం నీరసించింది. ట్రేడైన మొత్తం షేర్లలో 1479 నష్టపోగా.. 1235 మాత్రమే లాభాలతో ముగిశాయి. అడాగ్‌ కౌంటర్లలో రిలయన్స్ కేపిటల్‌, రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా 9-4 శాతం మధ్య పతనమయ్యాయి. 

ఎఫ్‌పీఐల జోరు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2722 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1508 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.Most Popular