అడాగ్‌ షేర్లకు ఆర్‌కామ్‌ షాక్‌!

అడాగ్‌ షేర్లకు ఆర్‌కామ్‌ షాక్‌!

ప్రమోటర్లు తనఖాలో ఉంచిన రిలయన్స్ కమ్యూనికేషన్స్‌(ఆర్‌కామ్‌) షేర్లను రుణదాతలు తాజాగా విక్రయించినట్లు వెల్లడికావడంతో అనిల్‌ అంబానీ గ్రూప్‌(అడాగ్‌) కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో రిలయన్స్‌ కేపిటల్‌ 6.5 శాతం పతనమై రూ. 176 దిగువకు చేరింది. ఆర్‌కామ్‌ 4 శాతం వెనకడుగుతో రూ. 4.70ను తాకగా.. రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ దాదాపు 3 శాతం క్షీణించి రూ. 126 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో రిలయన్స్‌ పవర్‌ దాదాపు 5 శాతం తిరోగమించి రూ. 11ను తాకింది. ఇక రిలయన్స్‌ నావల్‌ 3.3 శాతం బలహీనపడి రూ. 10.3కు చేరింది. ఇతర కౌంటర్లలో రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ 3 శాతం నష్టంతో రూ. 27.50 వద్ద, రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ 2 శాతం నీరసించి రూ. 198 వద్ద కదులుతున్నాయి.

12 కోట్ల షేర్లు
ఆర్‌కామ్‌కు చెందిన 12 కోట్ల షేర్లను రుణదాతలు తాజాగా విక్రయించినట్లు వెల్లడైంది. ఇవి ప్రమోటర్‌ వాటాలో 4.34 శాతానికి సమానంకాగా.. యాక్సిస్‌ బ్యాంక్‌కు అనుబంధ సంస్థ యాక్సిస్‌ ట్రస్టీ సర్వీసెస్‌ 12 కోట్ల షేర్లను విక్రయించినట్లు ఆర్‌కామ్‌ పేర్కొంది. దీంతో ఆర్‌కామ్‌లో ప్రమోటర్ల వాటా 41.91 శాతం నుంచి 37.57 శాతానికి క్షీణించినట్లు తెలియజేసింది. కాగా.. ఇంతక్రితం ఎస్‌టీసీఐ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ సైతం దాదాపు 7 శాతం వాటాకు సమానమైన వాటాను విక్రయించాయి. దీంతో మార్చి మొదటివారానికల్లా ఆర్‌కామ్‌లో ప్రమోటర్‌ వాటా మార్చికల్లా 48.77 శాతం నుంచి 41.91 శాతానికి దిగివచ్చింది. 2018 డిసెంబర్‌ చివరికి ఆర్‌కామ్‌లో ప్రమోటర్లు, ప్రమోటర్‌ గ్రూప్‌నకు 53.08 శాతం వాటా ఉంది.Most Popular