బ్లూస్టార్‌ షైనింగ్‌- వోల్టాస్‌ వీక్‌

బ్లూస్టార్‌ షైనింగ్‌- వోల్టాస్‌ వీక్‌

సరికొత్త మోడల్‌ ఏసీలను మార్కెట్లో విడుదల చేసినట్లు వెల్లడించడంతో వైట్‌గూడ్స్‌ దిగ్గజం బ్లూస్టార్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. దీంతో ఒడిదొడుకుల మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తోంది. అయితే మరోపక్క విదేశీ బ్రోకింగ్‌ సంస్థ సెల్‌ రేటింగ్‌ను ప్రకటించడంతో టాటా గ్రూప్‌ వైట్‌గూడ్స్‌ దిగ్గజం వోల్టాస్‌ లిమిటెడ్‌ కౌంటర్ ఇన్వెస్టర్ల అమ్మకాలతో బలహీనపడింది. ఇతర వివరాలు చూద్దాం...

బ్లూస్టార్‌ లిమిటెడ్‌
ప్లాటినం జూబిలీ వార్షికోత్సవాల్లో భాగంగా 75 మోడళ్లను కొత్తగా మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు బ్లూస్టార్‌ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. వీటిలో రేటెడ్‌ కెపాసిటీకి మించి 30 శాతంవరకూ చల్లదనాన్ని అందించగల మోడళ్లు ఉన్నట్లు తెలియజేసింది. ఇదేవిధంగా 18 శాతం తక్కువగా విద్యుత్‌ వినియోగించుకునే మోడళ్లున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో బ్లూస్టార్‌ షేరు 2.4 శాతం పెరిగి రూ. 680 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 688 వరకూ ఎగసింది. ఈ ఏడాది వేసవి ఎండలు మండనున్న అంచనాలతో ఈ కౌంటర్‌ జోరందుకున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కంపెనీలో ప్రమోటర్లకు 38.76% వాటా ఉంది.

Image result for Voltas ltd

వోల్టాస్‌ లిమిటెడ్‌
విదేశీ బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ రూ. 500 టార్గెట్‌ ధరతో వోల్టాస్‌ లిమిటెడ్‌ షేరుకి సెల్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో వోల్టాస్‌ షేరు 2.6 శాతం క్షీణించి రూ. 603 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 599 వరకూ నీరసించింది. కాగా.. వోల్ట్‌బెక్‌ జేవీకి మంచి రెస్పాన్స్‌ లభిస్తున్నదని, దక్షిణాదినుంచి పెరుగుతున్న డిమాండ్‌ కారణంగా ఏసీ ఇన్వెంటరీ సైతం తగ్గుతున్నదని తెలియజేసింది. ఇవి సానుకూల అంశాలుకాగా.. కరెన్సీ ప్రభావంవల్ల మార్జిన్లు మందగించవచ్చని సీఎల్‌ఎస్‌ఏ అంచనా వేస్తోంది.Most Popular