దీప్‌ ఇండస్ట్రీస్‌- స్టార్‌ సిమెంట్- ఖుషీ

దీప్‌ ఇండస్ట్రీస్‌- స్టార్‌ సిమెంట్- ఖుషీ

ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఓఎన్‌జీసీ నుంచి కాంట్రాక్టు లభించినట్లు వెల్లడించడంతో దీప్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. మరోపక్క రవాణా సబ్సిడీ క్లెయిములను అందుకున్నట్లు పేర్కొనడంతో స్టార్‌ సిమెంట్ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఈ రెండు కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

దీప్‌ ఇండస్ట్రీస్‌
పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్‌జీసీ నుంచి రిగ్గు సరఫరా కోసం ఆర్డర్ లభించినట్లు దీప్‌ ఇండస్ట్రీస్‌ పేర్కొంది. మూడేళ్లపాటు అమలులో ఉండే కాంట్రాక్టు విలువను దాదాపు రూ. 92 కోట్లుగా తెలియజేసింది. ఆర్డర్‌లో భాగంగా 1,000 హెచ్‌పీ డ్రిల్లింగ్‌ రిగ్గును ఓఎన్‌జీసీ అహ్మదాబాద్‌ క్షేత్రానికి సరఫరా చేయవలసి ఉంటుందని తెలియజేసింది. ఈ నేపథ్యంలో దీప్‌ ఇండస్ట్రీస్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 11 శాతంపైగా దూసుకెళ్లి రూ. 158 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 164 వరకూ జంప్‌చేసింది. దీప్‌ ఇండస్ట్రీస్‌లో ప్రమోటర్లకు 63.49% వాటా ఉంది. 

Image result for star cement

స్టార్‌ సిమెంట్
కేంద్ర ప్రభుత్వం నుంచి రవాణా సబ్సిడీ క్లెయిములను అందుకున్నట్లు వెల్లడించడంతో స్టార్‌ సిమెంట్‌ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 105 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 109 వరకూ జంప్‌చేసింది. ఫ్రయిట్‌ సబ్సిడీలో భాగంగా ప్రభుత్వం నుంచి రూ. 115 కోట్లు లభించినట్లు స్టార్‌ సిమెంట్ తెలియజేసింది. వారం రోజుల్లోగా మరో రూ. 42.55 కోట్లు అందుకునే వీలున్నట్లు వెల్లడించింది. Most Popular