రుపీకి పెట్టుబడుల బూస్ట్‌

రుపీకి పెట్టుబడుల బూస్ట్‌

డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ జోరందుకుంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 14 పైసలు బలపడింది. 70.01 వద్ద ట్రేడింగ్‌ మొదలైంది. ప్రస్తుతం మరికాస్త పుంజుకుని సాంకేతికంగా కీలకమైన 70 దిగువకు చేరింది. 21 పైసలు(0.3 శాతం) ఎగసి 69.94 వద్ద రూపాయి ట్రేడవుతోంది. అయితే వారాంతాన మూడు రోజుల రూపాయి ర్యాలీకి బ్రేక్‌ పడింది. 15 పైసలు క్షీణించి 70.15 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 69.81-7022 మధ్య ఊగిసలాడింది. చివరికి నేలచూపుతో ముగిసింది. కాగా.. గత వారం మొదట్లో ర్యాలీ బాట పట్టిన రూపాయి గురువారం సైతం 28 పైసలు పుంజుకుని 70 వద్ద ముగిసింది. వెరసి మూడు రోజుల్లో 92 పైసలు ర్యాలీ చేసింది. తద్వారా  జనవరి 8 తరువాత రూపాయి తిరిగి 70 స్థాయికి చేరిన విషయం విదితమే.

కారణాలివీ...
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరుగా ప్రారంభమయ్యాయి. దీనికితోడు ఇటీవల దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారీ పెట్టుబడులు చేపడుతుండటం రూపాయికి బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు దేశీ కేపిటల్‌ మార్కెట్లో నికరంగా రూ. 2700 కోట్లు ఇన్వెస్ట్‌చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తాఇస్తున్నారు. దీనికితోడు ఓపెన్‌ మార్కెట్ ద్వారా రిజర్వ్ బ్యాంక్‌ కొద్ది రోజులుగా లిక్విడిటీని మెరుగుపరచడం కూడా రూపాయికి బలాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. Most Popular