ఈ వారం మార్కెట్ల దారెటు?!

ఈ వారం మార్కెట్ల దారెటు?!

ఆర్థిక గణాంకాలు, విదేశీ పరిస్థితులు, ఎన్నికల అంచనాలు తదితర అంశాలు ఈ వారం  దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించే అవకాశముంది. కార్పొరేట్‌ ఫలితాల సీజన్‌, ఫిబ్రవరి డెరివేటివ్‌ సిరీస్‌ ముగింపు కారణంగా ఇకపై ఇన్వెస్టర్లు సార్వత్రిక ఎన్నికలకు తెరతీయనున్న ఎన్నికల నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూడనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మంగళవారం(12న) జనవరి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) ప్రగతి వివరాలు తెలియనున్నాయి. డిసెంబర్‌లో ఐఐపీ 2.4 శాతం పుంజుకుంది. ఈ బాటలో ఫిబ్రవరి నెలకు వినియోగ ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు విడుదలకానున్నాయి. జనవరిలో సీపీఐ 2.05 శాతంగా నమోదైంది. 

Related image

విదేశీ మార్కెట్లపై చూపు
గత వారాంతాన యూరోజోన్‌ ఆర్థిక వృద్ధి అంచనాలను యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ 1.7 శాతం నుంచి 1.1 శాతానికి కుదించింది. దీంతో వడ్డీ రేట్ల పెంపును చేపట్టకపోగా.. రుణాలను మరింత చౌక చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాల కారణంగా ప్రపంచ జీడీపీ నెమ్మదించనున్న అంచనాలు బలపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో శుక్రవారం(8న) అమెరికాసహా ఆసియా వరకూ పలు మార్కెట్లు అమ్మకాలతో నీరసించాయి. శుక్రవారం విడుదలైన అమెరికా ఉపాధి గణాంకాలు ఫిబ్రవరి నెలకు అంచనాలను చేరకపోవడంతో యూఎస్‌ మార్కెట్లు వరుసగా ఐదో రోజు బలహీనపడ్డాయి. 

బ్రెక్సిట్‌ ఎఫెక్ట్‌
మంగళవారం యూకే ప్రధాని థెరెసా మే ప్రతిపాదించిన రివైజ్‌డ్‌ బ్రెక్సిట్‌ డీల్‌పై హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ ఓటింగ్‌ను చేపట్టనుంది. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగే(బ్రెక్సిట్‌) డీల్‌పై కొన్ని నెలలుగా అస్పష్టత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ గురువారం(14న) మానిటరీ పాలసీ సమీక్షను చేపట్టనుంది. శుక్రవారం పరపతి నిర్ణయాలు ప్రకటించనుంది. 

ఇతర అంశాలూ కీలకమే
ప్రపంచ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులతోపాటు.. ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు తదితర పలు అంశాలు దేశీ స్టాక్‌ మార్కెట్లలో సెంటిమెంటును ప్రభావితం చేయగలవని విశ్లేషకులు తెలియజేశారు.Most Popular