అరవింద్‌ ఫ్యాషన్స్‌ లిస్టింగ్‌- కేఎన్‌ఆర్ -భళా

అరవింద్‌ ఫ్యాషన్స్‌ లిస్టింగ్‌- కేఎన్‌ఆర్ -భళా

జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నుంచి తాజాగా కాంట్రాక్టు పొందినట్లు వెల్లడించడంతో మౌలిక సదుపాయాల హైదరాబాద్‌ సంస్థ కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌ కౌంటర్ జోరందుకుంది. మరోపక్క అరవింద్‌ లిమిటెడ్‌ నుంచి ప్రత్యేక కంపెనీగా విడివడిన అరవింద్‌ ఫ్యాషన్స్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో హుషారుగా లిస్టయ్యింది. వివరాలు చూద్దాం..

అరవింద్‌ ఫ్యాషన్స్‌
అరవింద్‌ లిమిటెడ్‌ నుంచి ప్రత్యేక కంపెనీగా విడివడిన అరవింద్‌ ఫ్యాషన్స్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో నేడు లిస్టయ్యింది. ఎన్‌ఎస్ఈలో ఈ షేరు రూ. 591 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి రూ. 620కు జంప్‌చేసింది. ఇది 5 శాతం వృద్ధికాగా.. అమ్మకందారులు కరవుకావడంతో ఇదే ధర వద్ద ఫ్రీజయ్యింది. అరవింద్‌ లిమిటెడ్‌ వాటాదారులకు తమ దగ్గరున్న ప్రతీ 5 షేర్లకుగాను 1 అరవింద్‌ ఫ్యాషన్స్‌ షేరుని కేటాయించిన విషయం విదితమే. అరవింద్‌ ఫ్యాషన్స్‌ పేరుతో టెక్స్‌టైల్‌ బ్రాండ్లు, రిటైల్‌ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా లాల్‌భాయ్‌ గ్రూప్‌ సంస్థ అరవింద్‌ లిమిటెడ్‌ విడదీసింది. కాగా.. ప్రస్తుతం అరవింద్‌ లిమిటెడ్‌ షేరు 4 శాతంపైగా పతనమై రూ. 86 దిగువన ట్రేడవుతోంది.

Image result for knr constructions

కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌
రహదారుల అభివృద్ధి కోసం మొత్తం రూ. 1055 కోట్ల విలువైన రెండు ఆర్డర్లు లభించినట్లు కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ తాజాగా వెల్లడించింది. వీటిలో భారత్‌మాల పరియోజన తొలి దశలో భాగంగా తమిళనాడులోని ఎన్‌హెచ్‌ 209లో రహదారి అభివృద్ధి కోసం కాంట్రాక్టు పొందినట్లు పేర్కొంది. నాలుగు లైన్లలో రహదారి అభివృద్ధి కోసం హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌లో లభించిన కాంట్రాక్టు విలువను రూ. 920 కోట్లుగా తెలియజేసింది. ఇదే విధంగా కర్ణాటక రోడ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ నుంచి సైతం రూ. 135 కోట్ల ఆర్డర్‌ దక్కినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో కేఎన్‌ఆర్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 244 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 249 వరకూ ఎగసింది. 

ఆర్డర్‌ బుక్‌ జోష్‌
విదేశీ రీసెర్చ్‌ సంస్థ జేఎం ఫైనాన్షియల్‌ బయ్‌ రేటింగ్‌ను ప్రకటించడంతో కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌ కౌంటర్‌ గురువారం సైతం జోరందుకుంది. ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో 7 శాతం జంప్‌చేసి రూ. 235 వద్ద ముగిసింది. కంపెనీ చరిత్రలోనే రికార్డ్‌ స్థాయికి చేరిన ఆర్డర్‌బుక్‌ కేఎన్‌ఆర్‌ పనితీరు మెరుగుకు దోహదం చేయనున్నట్లు జేఎం ఫైనాన్షియల్‌ అభిప్రాయపడింది. దీనికితోడు ఇకపై జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(NHAI) నుంచి మరిన్ని కాంట్రాక్టులు లభించనున్నట్లు అంచనా వేసింది. దీంతో రూ. 255 టార్గెట్‌ ధరతో షేరు కొనుగోలుకి సిఫారసు చేసింది.Most Popular