ఈసీబీ షాక్‌- ప్రపంచ మార్కెట్లు వీక్‌

ఈసీబీ షాక్‌- ప్రపంచ మార్కెట్లు వీక్‌

ఈ ఏడాది(2019)లో యూరోజోన్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌(ఈసీబీ) ఉన్నట్టుండి భారీగా కుదించింది. తొలుత వేసిన 1.7 శాతం జీడీపీ అంచనాలను తాజాగా 1.1 శాతానికి సవరించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు చెలరేగాయి. అమెరికా, చైనా వాణిజ్య వివాదాలు, వివిధ దేశాలలో రాజకీయ అనిశ్చితులు వంటి అంశాలు ప్రపంచ వృద్ధిని దెబ్బతీయనున్న అంచనాలకు మరోసారి బలాన్ని చేకూర్చాయి. దీంతో గురువారం తొలుత యూరోపియన్‌ మార్కెట్లలో జర్మనీ, ఫ్రాన్స్‌, యూకే 0.5 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. ఈ బాటలో అమెరికా మార్కెట్లు సైతం నేలచూపులతో ముగిశాయి. డోజోన్స్‌ 200 పాయింట్లు(0.8 శాతం) క్షీణించి 25,473కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 23 పాయింట్లు(0.8 శాతం) బలహీనపడి 2,749 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ సైతం 84 పాయింట్లు(1.1 శాతం) వెనకడుగు వేసి 7,421 వద్ద స్థిరపడింది. వెరసి వరుసగా నాలుగో రోజు యూఎస్‌ మార్కెట్లు నష్టాలతో నిలిచాయి.

ఈసీబీ ఎఫెక్ట్‌
యూరోజోన్‌ ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి మందగిస్తున్నట్లు ఈసీబీ చీఫ్‌ మారియో డ్రాఘీ తాజా అంచనాలు ప్రకటించారు. పాలసీ సమీక్షలో భాగంగా వడ్డీ రేట్ల పెంపును చేపట్టకపోగా.. రుణాలను మరింత చౌక చేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ప్రపంచ ఆర్థిక వృద్ధిపై మరోసారి సందేహాలు తలెత్తాయి.

Related image

ఫెడెక్స్‌ వీక్‌
ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం సిటీగ్రూప్‌ త్రైమాసిక ఆదాయ అంచనాలను తగ్గించడంతోపాటు టార్గెట్‌ ధరలో కోత పెట్టడంతో ప్యాకేజ్‌ డెలివరీ దిగ్గజం ఫెడెక్స్‌ కార్ప్‌ 3 శాతం పతనమైంది. ఈ బాటలో 2019 నికర లాభ అంచనాలు నిరాశపరచడంతో క్రోగర్‌ కో షేరు 10 శాతం కుప్పకూలింది. కాగా.. యూరోజోన్‌ నెమ్మదిస్తున్న అంచనాలతో జర్మన్‌, ఫ్రెంచ్‌ బాండ్ల ఈల్ట్స్‌ 2016 తదుపరి కనిష్టాలకు చేరాయి. ప్రధానంగా యూరోపియన్‌ బ్యాంకింగ్‌ స్టాక్స్‌ డీలాపడ్డాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 97.61కు బలపడగా.. యూరో 1 శాతం క్షీణించి 1.119కు బలహీనపడింది.  జపనీస్ యెన్‌ 111.58 వద్ద కదులుతోంది.

ఆసియా నేలచూపు
ఈసీబీ అంచనాల నేపథ్యంలో ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. చైనా, జపాన్, హాంకాంగ్‌, తైవాన్‌, కొరియా, సింగపూర్‌, ఇండొనేసియా 1.5-0.4 శాతం క్షీణించాయి. మిగిలిన మార్కెట్లలో థాయ్‌లాండ్‌ ఓపెన్‌కాలేదు.