విప్రో -ఐటీసీ -ఖుషీ

విప్రో -ఐటీసీ -ఖుషీ

వాటాదారులకు బోనస్‌ షేర్ల జారీకి రికార్డ్‌ డేట్‌ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోవైపు వివిధ బ్రాండ్ల సిగరెట్‌ రేట్లను పెంచినట్లు వెల్లడికావడంతో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్‌ కౌంటర్‌ సైతం వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ రెండు దిగ్గజ కంపెనీల షేర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఇతర వివరాలు ఇలా...

విప్రో లిమిటెడ్‌
ఐటీ సేవల బ్లూచిప్‌ కంపెనీ విప్రో లిమిటెడ్‌ వాటాదారులకు బోనస్‌ షేర్ల జారీకి ఈ నెల 7 రికార్డ్‌ డేట్‌గా ప్రకటించడంతో ఎక్స్‌బోనస్‌లోకి చేరింది. వాటాదారులకు 1:3 నిష్పత్తిలో బోనస్‌ షేర్లను జారీ చేయనుంది. ప్రతీ 3 షేర్లకు 1 షేరుని ఫ్రీగా కేటాయించనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో విప్రో షేరు 3.2 శాతం జంప్‌ చేసి రూ. 281 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 286 వరకూ ఎగసింది. కాగా.. గత 8 నెలల్లో విప్రో షేరు 45 శాతం ర్యాలీ చేయడం విశేషం! ఇదే కాలంలో నిఫ్టీ 4 శాతమే బలపడింది.

Image result for ITC Ltd

ఐటీసీ లిమిటెడ్‌
బ్రిస్టల్‌, ఫ్లేక్‌ ఎక్సెల్‌, క్యాప్‌స్టాన్‌ బ్రాండ్‌ సిగరెట్ ధరలను పెంచుతున్న అంచనాలతో మంగళవారం సైతం బలపడిన ఐటీసీ లిమిటెడ్‌ కౌంటర్ మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఐటీసీ షేరు దాదాపు 2 శాతం పుంజుకుని రూ. 287 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 289 వరకూ ఎగసింది. మంగళవారం సైతం ఈ షేరు 2 శాతం లాభపడింది. ఐటీసీ తాజాగా క్యాప్‌స్టాన్‌ సిగరెట్‌ ధరను 14.5 శాతం పెంచగా, ఫ్లేక్‌ ఎక్సెల్‌పై 11 శాతం, బ్రిస్టల్‌ బ్రాండ్‌పై 7 శాతం చొప్పున రేట్లను పెంచినట్లు కంపెనీ పేర్కొంది. కాగా.. విదేశీ బ్రోకింగ్‌ దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ ఐటీసీ కౌంటర్‌కు రూ. 320 టార్గెట్‌ ధరతో ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ను ప్రకటించింది. Most Popular