దివాన్‌ దూకుడు- ఎండ్యూరెన్స్‌ షాక్‌(అప్‌డేట్‌)

దివాన్‌ దూకుడు- ఎండ్యూరెన్స్‌ షాక్‌(అప్‌డేట్‌)

కోబ్రాపోస్ట్‌ పేర్కొన్న షెల్‌ కంపెనీలతో ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌కు ఎలాంటి సంబంధాలూ ఉన్నట్లు ఆధారాలు లభించలేదని చార్టర్డ్‌ అకౌంటింగ్‌ సంస్థ తాజాగా పేర్కొనడంతో ఈ కౌంటర్‌కు జోష్‌వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో భారీ లాభాలతో సందడి చేస్తోంది. మరోపక్క సెబీ నిబంధనలకు అనుగుణంగా ప్రమోటర్లు వాటాను విక్రయించనున్న వార్తలతో ఎండ్యూరెన్స్‌ టెక్నాలజీస్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వివరాలు చూద్దాం.. 

దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్
కోబ్రాపోస్ట్‌ పేర్కొన్న షెల్‌ కంపెనీలకు నిధులను మళ్లించడం, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వంటి అంశాలలో దివాన్‌ హౌసింగ్‌ అక్రమాల్పకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని చార్టర్డ్‌ అకౌంటింగ్‌ సంస్థ టీపీ ఓస్త్వాల్‌ అండ్‌ అసోసియేట్స్‌ తాజాగా పేర్కొంది. షెల్‌ కంపెనీల ఏర్పాటు, వీటికి అక్రమంగా నిధులు మళ్లించడం తదితరాలను దివాన్‌ చేపట్టినట్లు చెప్పేందుకు ఎలాంటి ఆధారాలూ లభ్యంకాలేదని స్పష్టం చేసింది. దీంతో ఈ కౌంటర్‌ వరుసగా రెండో రోజు హైజంప్‌ చేసింది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో దివాన్‌ హౌసింగ్‌ షేరు 14 శాతంపైగా దూసుకెళ్లింది. రూ. 153 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 162ను సైతం అధిగమించింది.

Image result for endurance technologies

ఎండ్యూరెన్స్‌ టెక్నాలజీస్‌
నేటి నుంచి రెండురోజులపాటు సంస్థాగత ఇన్వెస్టర్లకు ప్రమోటర్ల వాటాలో 7.5 శాతం వాటాను విక్రయించనున్నట్లు ఎండ్యూరెన్స్‌ టెక్నాలజీస్‌ తాజాగా తెలియజేసింది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌)లో భాగంగా 4.52 శాతం ఈక్విటీకి సమానమైన 63.6 లక్షల షేర్లను విక్రయించనున్నట్లు వెల్లడించింది. వీటికి అదనంగా డిమాండ్‌ను బట్టి మరో 41.9 లక్షల షేర్లను సైతం అమ్మేందుకు నిర్ణయించినట్లు వివరించింది. ఇది 2.98 శాతం ఈక్విటీకి సమానంకాగా.. ఇందుకు ఫ్లోర్‌ ధర రూ. 1100గా నిర్ణయించింది. మంగళవారం ముగింపు ధరతో పోలిస్తే ఇది 12.6 శాతం డిస్కౌంట్‌ కావడం గమనార్హం! ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో అమ్మకాలకు ఎగబడుతున్నారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎండ్యూరెన్స్‌ టెక్నాలజీస్‌ షేరు 8 శాతంపైగా కుప్పకూలింది. రూ. 1156 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1136 వరకూ పతనమైంది.  కాగా.. కంపెనీలో ప్రస్తుతం ప్రమోటర్లకు 82.5 శాతం వాటా ఉంది. అయితే సెబీ నిబంధనలకు అనుగుణంగా ఈ వాటాను 75 శాతానికి తగ్గించుకోవలసి ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు.Most Popular