ఎలక్షన్‌ కమిషన్‌పై ఇన్వెస్టర్ల దృష్టి?

ఎలక్షన్‌ కమిషన్‌పై ఇన్వెస్టర్ల దృష్టి?

ఇకపై స్టాక్ ఇన్వెస్టర్లు ఎలక్షన్‌ కమిషన్‌పై దృష్టిసారించనున్నారు. ఈ వారంలో ఎలక్షన్‌ కమిషన్‌ సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేసే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఇటీవల సమయానుగుణంగానే ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. దీంతో మే చివరికల్లా కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశమున్నట్లు పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు అనుగుణంగా ఈ నెలలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే చాన్స్‌ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కాగా.. వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ స్వదేశానికి చేరిన నేపథ్యంలో ఇకపై దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను ప్రధానంగా ఎన్నికల మూడ్‌ నిర్దేశించే వీలున్నట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

నాలుగు రోజులే ట్రేడింగ్
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సోమవారం(4న) దేశీ స్టాక్‌ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ పనిచేయవు. ట్రేడింగ్‌ తిరిగి మంగళవారం(5న) ప్రారంభంకానుంది. దీంతో ఈ వారం మార్కెట్లు నాలుగు రోజులే పనిచేయనున్నాయి. కాగా.. ఫిబ్రవరి సర్వీసుల రంగ పీఎంఐ గణాంకాలు 5న విడుదలకానున్నాయి. యూఎస్‌ తయారీయేతర పీఎంఐ వివరాలు సైతం ఇదే రోజు వెల్లడికానున్నాయి. ఈ బాటలో 6న డిసెంబర్‌ నెలకు యూఎస్‌ వాణిజ్య గణాంకాలు విడుదలకానున్నాయి. 8న చైనా జనవరి వాణిజ్య గణాంకాలు తెలియనున్నాయి. అమెరికా వ్యవసాయేతర రంగ ఉపాధి వివరాలు సైతం ఇదే రోజు వెల్లడికానున్నాయి. వీటికితోడు భారత్‌, పాకిస్తాన్‌ వివాదాలు, బ్రెక్సిట్‌, అమెరికా, చైనా వాణిజ్య పరిష్కార చర్చలు వంటి పలు అంశాలు ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటును ప్రభావితం చేసే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

ఇతర అంశాలు..
ముడిచమురు ధరలు, విదేశీ, స్వదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి పలు అంశాలు సైతం దేశీయంగా మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్ధేశించగలవని విశ్లేషకులు వివరించారు. Most Popular