ఈ వారం జీడీపీ- ఎఫ్‌అండ్‌వో- కీలకం

ఈ వారం జీడీపీ- ఎఫ్‌అండ్‌వో- కీలకం

దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను ఈ వారం ప్రధానంగా ఆర్థిక పురోగతి గణాంకాలు నిర్దేశించనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19)  మూడో త్రైమాసికంలో దేశ జీడీపీ 6.9 శాతం వృద్ధిని సాధించగలదని అత్యధిక శాతం మంది ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. క్యూ2 (ఆగస్ట్‌-అక్టోబర్‌)లో దేశ ఆర్థిక వ్యవస్థ 7.1 శాతం ఎగసింది. ప్రభుత్వం 28న(గురువారం) క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) జీడీపీ గణాంకాలు విడుదల చేయనుంది. వీటితోపాటు ద్రవ్యలోటు వివరాలూ ప్రకటించే వీలుంది. దీంతో ఇన్వెస్టర్లు ఈ గణాంకాల కోసం వేచిచూసే ధోరణిలో వ్యవహరించే అవకాశమున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. గురువారం విడుదలైన గత పాలసీ(ఫిబ్రవరి 5-7) వివరాల ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి వీలుగా తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. 

డెరివేటివ్స్‌పై కన్ను
ఫిబ్రవరి ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగియనున్న నేపథ్యంలో మార్కెట్లు కొంతమేర ఊగిసలాటకు లోనయ్యే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రేడర్లు తమ పొజిషన్లను మార్చి సిరీస్‌కు రోలోవర్‌ చేసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వడంతో ట్రేడింగ్‌ యాక్టివిటీ పెరుగుతుందని తెలియజేశారు. ఇదే రోజు ప్రభుత్వం జనవరి నెలకు ఆరు కీలక పరిశ్రమలతో కూడిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రగతి వివరాలను సైతం వెల్లడించనుంది. 

Related image

ఆటో షేర్లు వెలుగులో
వారాంతాన(మార్చి 1) ఆటో రంగ కంపెనీలు ఫిబ్రవరి నెలకు వాహన విక్రయ గణాంకాలు ప్రకటించనున్నాయి. దీంతో శుక్రవారం ప్రధానంగా ఆటో రంగ కౌంటర్లు యాక్టివ్‌గా ట్రేడయ్యే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కాగా.. వీటితోపాటు ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు వంటి ఇంతర అంశాలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు తెలియజేశారు.

విదేశీ అంశాలూ కీలకమే
అమెరికా, చైనా మధ్య ప్రారంభమైన వాణిజ్య వివాద చర్చలూ ఈ వారం కీలకంగా నిలిచే అవకాశముంది. చైనా దిగుమతులపై అధిక టారిఫ్‌లు విధించేందుకు అమెరికా ప్రకటించిన గడువు మార్చి1న ముగియనుంది. ఈలోగా వాణిజ్య వివాద పరిష్కారాన్ని కుదుర్చుకోవాలని ఇరు దేశాలూ భావిస్తుండటం గమనార్హం! ఇందుకు ప్రస్తుతం వాషింగ్టన్‌లో రెండు దేశాల అత్యున్నత అధికారుల మధ్య చర్చలు ప్రారంభంకాగా.. వచ్చే వారం సైతం చైనాలో ఇవి కొనసాగనున్నాయి. Most Popular