భారత్‌ రసాయన్‌- వరుణ్‌- ప్లస్‌లో

భారత్‌ రసాయన్‌- వరుణ్‌- ప్లస్‌లో

విభిన్న అంశాల నేపథ్యంలో టెక్నికల్‌ గ్రేడ్‌ పెస్టిసైడ్స్‌ తయారీ సంస్థ భారత్‌ రసాయన్‌ లిమిటెడ్‌, పెప్సీకో ఫ్రాంచైజీలు, బాట్లింగ్‌ సంస్థ వరుణ్‌ బెవరేజెస్‌, ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్ కౌంటర్లు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

భారత్‌ రసాయన్‌
కమర్షియల్‌ పేపర్స్ జారీ ద్వారా రూ. 20 కోట్లను సమీకరించినట్లు భారత్‌ రసాయన్‌ తాజాగా పేర్కొంది. వీటికి రేటింగ్‌ సంస్థ కేర్‌ నుంచి A1+ రేటింగ్‌ లభించినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో భారత్‌ రసాయన్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 4.5 శాతం జంప్‌చేసి రూ. 3608 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 3830 వరకూ దూసుకెళ్లింది. 

Related image

వరుణ్‌ బెవరేజెస్
దేశ దక్షిణ, పశ్చిమ ప్రాంతాలలో పెప్సీకో పానీయాల పంపిణీ, బాట్లింగ్‌ హక్కులకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించడంతో వరుణ్‌ బెవరేజెస్‌ కౌంటర్‌ వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. పెప్సీకోతో ఒప్పందంలో భాగంగా ఏడు రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాలలో బాట్లింగ్‌, అమ్మకాలు, పంపిణీ చేపట్టేందుకు హక్కులు లభించనున్నట్లు తెలియజేసింది. దీంతో కంపెనీ మొత్తం 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలలో పెప్సీకో ఫ్రాంచైజీల నిర్వహణ, బాట్లింగ్ తదితర కార్యకలాపాలను నిర్వహించనుంది. ఇక మరోవైపు అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు(క్విప్‌) ద్వారా నిధుల సమీకరణ చేపట్టనున్నట్లు కంపెనీ తెలియజేసింది. నిధుల అంశంపై ఈ నెల 26న బోర్డ్‌ సమావేశంకానున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 2.4 శాతం పెరిగి రూ. 789 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 805 వరకూ ఎగసింది.

ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్ 

ఎన్‌ఎస్‌ఈలో బ్లాక్‌డీల్‌ ద్వారా 15 లక్షల షేర్లు చేతులు మారినట్లు వెల్లడికావడంతో ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కౌంటర్ బలపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 2 శాతం లాభంతో రూ. 139 వద్ద ట్రేడవుతోంది.