భారతీయ టాప్ 5.. టైర్ -1 ఐటీ కంపెనీలకు తిరుగులేదా?

 భారతీయ టాప్ 5.. టైర్ -1 ఐటీ కంపెనీలకు తిరుగులేదా?

దేశీయ స్టాక్ మార్కెట్లు అనిశ్చితితోనే ఉన్నాయి. బడ్జెట్ సెషన్స్ ముగిసాక కూడా మార్కెట్లలో కదలిక లేక పోగా, నిఫ్టీ, ఇండెక్స్ సూచీలు క్షీణతను ఎదుర్కొంటున్నాయి. నిఫ్టీ 11,000 పాయింట్లు, సెన్సెక్స్ 37,000 పాయింట్ల గరిష్టానికి చేరుకున్న ఆ ముచ్చట కొన్ని సెషన్స్ వరకే పనికొచ్చింది. తరువాత మళ్ళీ షరా మామూలే అన్న చందంగా మారింది. నేటి సోమవారం నాటి మార్కెట్లలో నిఫ్టీ 10,900 లోపు, సెన్సెక్స్ 36,421 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ రంగాలు ఈ జనవరి నుండి పూర్తిగా నిరాశపూరితంగానే ఫలితాలను వెల్లడిస్తున్నాయి. లార్జ్ క్యాప్ రంగంలో కూడా ఒక్క ఐటీ సెక్టార్ మినహాయించి మిగతా వాటి పనితీరు అంతంత మాత్రంగానే ఉందని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏ స్టాక్స్ లో పెట్టుబడులు మంచి లాభాలను తీసుకొస్తాయి.. , లార్జ్ క్యాప్ రంగంలో వేటిమీద పెట్టుబడులు సురక్షితం అన్న ప్రశ్నలకు ఎనలిస్టులు , ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు ఈ కింది విధంగా సమాధానమిస్తున్నాయి. 
IT సెక్టార్ బెటర్ పెర్ఫార్మెన్స్...!
ద్రవ్య లోటు, రూపీ మారకపు విలువ క్షీణత, అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు, వంటి వాటి వల్ల మార్కెట్లు అస్థిరంగా కనబడుతున్నాయి. ఇదే సమయంలో గత సంవత్సరం 2018 అక్టోబర్ -డిసెంబర్ మధ్య కాలంలో ఐటీ సెక్టార్ గణనీయ ఫలితాలను నమోదు చేసింది. ఈ కంపెనీల పనితీరు రానున్న 2020 ఆర్ధిక సంవత్సరం వరకూ ఈ రంగంలో పెట్టుబడులకు ఢోకా లేకుండా చేసిందని ఎనలిస్టులు భావిస్తున్నారు. దేశంలోని టాప్ టైర్-1 ఐటీ కంపెనీలు 1.8 శాతం నుండి 5.6శాతం వరకూ రెవెన్యూ వృద్ధిని కనబరిచాయి. ఈ వృద్ధి వాటి స్టాక్స్ పురోగతికి ఉపకరించింది. 2019 ఆర్ధిక సంవత్సరం లో ఈ టాప్ 5 ఐటీ కంపెనీల షేర్లు మార్కెట్లలో 14 శాతం పెరుగుదలతో  ర్యాలీని కొనసాగించాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ 5శాతం పెరిగిన సమయంలో ఈ ర్యాలీ జరిగింది. అంతే కాకుండా ఈ సంవత్సరం 2019లో కూడా ఐటీ స్టాక్స్ స్థిరంగా రాణిస్తున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో స్టాక్స్ 14శాతం,  NIIT టెక్, టెక్ మహీంద్ర 13.69శాతం పెరగగా, ఒక్క ఇన్ఫీబీమ్ అవెన్యూస్ మాత్రం 30శాతం నష్టపోయింది. ఐటీ కంపెనీల బలమైన క్వార్టర్ రిజల్స్, రూపీ మారకపు విలువ క్షీణత వంటివి ఆయా కంపెనీల స్టాక్స్ పెరగడానికి కారణంగా నిలుస్తున్నాయి. ఈ వృద్ధి వచ్చే ఆర్ధిక సంవత్సరం పాటు కొనసాగవచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు.


కొన్ని సమస్యలున్నా.. పర్లేదు..కొనచ్చు!!
అమెరికా ఆర్ధిక వ్యవస్థ మందగించడం, బ్రెగ్జిట్ ఒప్పంది, అమెరికా చైనా ట్రేడ్ వార్  వంటివి దేశీయ ఐటీ పరిశ్రమ మీద ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ.. ఇప్పటిదాకా అవి నిర్వాహణ పరంగా ఈ సమస్యలను సమర్ధవంతంగానే ఎదుర్కొన్నాయని బ్రోకరేజ్ సంస్థలు భావిస్తున్నాయి. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ నోమురా కాగ్నిజెంట్, HCL టెక్  స్టాక్స్ కు బై రేటింగ్స్ ఇచ్చింది. టెక్ మహీంద్ర, విప్రో , ఇన్ఫోసిస్ స్టాక్స్ కు న్యూట్రల్ రేటింగ్స్ ను , TCS కు రెడ్యూస్ రేటింగ్సును ఇచ్చింది. HDFC సెక్యూరిటీస్ మాత్రం ఇన్ఫోసిస్, TCS స్టాక్స్ కు అవుట్ పెర్ఫార్మెన్స్ రేటింగ్స్ ను ఇచ్చింది. గత 4-5 ఏళ్ళ చరిత్రను పరిశీలిస్తే.. దేశీయ ఐటీ కంపెనీల పనితీరు ఎంతో మెరుగు పడిందని బ్రోకరేజ్ సంస్థలు భావిస్తున్నాయి. ఎనలిస్టుల ఫేవరేట్ స్టాక్‌ మాత్రం TCS నిలిచిందనే చెప్పాలి. లార్జ్ క్యాప్ రంగంలోని మిగతా ఐటీ దిగ్గజాలైన  ఇన్ఫోసిస్, HCL, టెక్ మహీంద్ర, మిడ్ క్యాప్ రంగంలోని లారెన్స్ &టుబ్రో ఇన్ఫోటెక్, NIIT టెక్, హెక్సావేర్ ,మైండ్ ట్రీ వంటి కంపెనీల్లో పెట్టుబడులు విలువైనవిగానే భావించవచ్చని ఎనలిస్టులు సూచిస్తున్నారు. 


Disclaimer: పైన పేర్కొన్న , సూచించిన సలహాలు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు, నిపుణులు ఇచ్చినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి. Most Popular