దిలీప్‌ బిల్డ్‌ జోష్‌- కేఆర్‌బీఎల్‌ వీక్‌

దిలీప్‌ బిల్డ్‌ జోష్‌- కేఆర్‌బీఎల్‌ వీక్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో మౌలిక సదుపాయాల సంస్థ దిలీప్‌ బిల్డ్‌కాన్‌ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో నష్టాల మార్కెట్లోనూ ఈ కౌంటర్‌ లాభాలతో సందడి చేస్తోంది. మరోపక్క బాస్మతి బియ్యం ఎగుమతుల సంస్థ కేఆర్‌బీఎల్‌ లిమిటెడ్‌ ప్రకటించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో ఈ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇతర వివరాలు చూద్దాం.. 

దిలీప్‌ బిల్డ్‌కాన్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో దిలీప్‌ బిల్డ్‌కాన్‌ నికర లాభం 26 శాతం పుంజుకుని రూ. 207 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 28 శాతం పెరిగి రూ. 2493 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో దిలీప్‌ బిల్డ్‌కాన్‌ షేరు ప్రస్తుతం 5.5 శాతం జంప్‌చేసి రూ. 354 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 358 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. కంపెనీలో ప్రమోటర్లకు 75.63% వాటా ఉంది. 

Related image

కేఆర్‌బీఎల్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో కేఆర్‌బీఎల్‌ లిమిటెడ్‌ నికర లాభం 13 శాతం క్షీణించి రూ. 107 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం 19 శాతం పెరిగి రూ. 936 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్‌ ఫలితాలివి. కాగా.. ఆదాయపన్ను శాఖ నుంచి రూ. 1296 కోట్లు చెల్లించమంటూ అందుకున్న డిమాండ్‌ నోటీసుపై అపిల్లేట్ అథారిటీస్‌ను ఆశ్రయించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇందుకు బోర్డు అనుమతించినట్లు తెలియజేసింది. 2010-11 నుంచి 2016-17 మధ్య కాలానికి సంబంధించి డిమాండ్‌ నోటీస్‌ అందుకున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో కేఆర్‌బీఎల్‌ లిమిటెడ్‌ షేరు ప్రస్తుతం 9 శాతం కుప్పకూలి రూ. 328 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 316 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.