నాల్కో, డాక్టర్‌ రెడ్డీస్‌ నేలచూపు

నాల్కో, డాక్టర్‌ రెడ్డీస్‌ నేలచూపు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో ఓవైపు పీఎస్‌యూ దిగ్గజం నాల్కో లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోపక్క అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) లోపాలను గుర్తించిన(అబ్జర్వేషన్స్‌) వార్తలతో హెల్త్‌కేర్‌ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్ల అమ్మకాలతో డీలాపడింది. ఇతర వివరాలు చూద్దాం.. 

నాల్కో లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో నాల్కో లిమిటెడ్‌ నికర లాభం 58 శాతం క్షీణించి రూ. 302 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం 14 శాతం పుంజుకుని రూ. 2719 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) 49 శాతం బలపడి రూ. 513 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 14.4 శాతం నుంచి 18.9 శాతానికి ఎగశాయి. కాగా.. గతేడాది(2017-18) క్యూ3లో రూ. 801 కోట్లమేర అనూహ్య లాభాలు నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో నాల్కో షేరు ప్రస్తుతం 7.2 శాతం పతనమై రూ. 55 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 54 వద్ద 52 వారాల కనిష్టానికి చేరింది.

Related image

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబ్‌
హైదరాబాద్‌కు సమీపంలోని బాచుపల్లి ఫార్ములేషన్ల ప్లాంటులో తనిఖీలు నిర్వహించిన యూఎస్‌ఎఫ్‌డీఏ 11 లోపాలను గుర్తించినట్లు(అబ్జర్వేషన్స్‌) వెల్లడించడంతో హెల్త్‌కేర్‌ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లేబ్‌ కౌంటర్లో అమ్మకాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు 3 శాతం క్షీణించి రూ. 2686 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2660 వరకూ నీరసించింది. కాగా.. నియమిత కాలంలోగా ఎఫ్‌డీఏ గుర్తించిన లోపాలను సవరించనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ఒక ప్రకటనలో తెలియజేసింది.Most Popular