యూఎస్‌ ఫ్లాట్‌- కాటీ, మాటెల్‌ జూమ్‌

యూఎస్‌ ఫ్లాట్‌- కాటీ, మాటెల్‌ జూమ్‌

ఓవైపు కార్పొరేట్‌ ఫలితాలు ఆకట్టుకున్నప్పటికీ.. మరోపక్క అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కార అంశంపై సందేహాలు ఇన్వెస్టర్లను అప్రమత్తం చేశాయి. దీంతో వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. శుక్రవారం డోజోన్స్‌ 63 పాయింట్లు(0.25 శాతం) నీరసించి 25,106 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ నామమాత్రంగా 2 పాయింట్లు(0.1 శాతం) జమచేసుకుని 2,708 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ సైతం 10 పాయింట్లు(0.15 శాతం) బలపడి 7,298 వద్ద స్థిరపడింది. గత వారం నికరంగా ఎస్‌అండ్‌పీ, డోజోన్స్‌ నామమాత్ర లాభాలు ఆర్జించగా.. నాస్‌డాక్‌ 0.5 శాతం ఎగసింది.

ట్రంప్‌ ఎఫెక్ట్‌
డెడ్‌లైన్‌లోగా అంటే మార్చి1కల్లా చైనా అధినేత జిన్‌పింగ్‌ను కలిసే అవకాశంలేదంటూ ప్రెసిడెటంట్‌ ట్రంప్‌ స్పష్టం చేయడంతో గత వారం చివర్లో మార్కెట్లు డీలాపడిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్‌ లైతిజెర్, ఆర్థిక కార్యదర్శి స్టీవెన్‌ ముచిన్‌ ఈ నెల 14-15న చైనాను సందర్శించనున్నట్లు అమెరికా ప్రభుత్వం తాజాగా పేర్కొంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న ఆందోళనలు ఇటీవల బలపడుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. 

Related image

ఎలక్ట్రానిక్‌ ఆర్ట్స్‌ జోరు
వారాంతాన కాటీ ఇంక్‌, మ్యాటెల్‌ ఇంక్‌, మోటరోలా సొల్యూషన్స్‌ అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించాయి. దీంతో నాస్‌డాక్‌ పుంజుకున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో బుధవారం భారీగా పతనమైన వీడియో గేమింగ్‌ సంస్థ ఎలక్ట్రానిక్‌ ఆర్ట్స్‌ బౌన్స్‌బ్యాక్‌ అయ్యింది. కంపెనీకి చెందిన గేమ్‌ ఎపెక్స్‌ లెజెండ్స్‌ మూడు రోజుల్లోనే 10 మిలియన్‌ ప్లేయర్లను ఆకట్టుకున్నట్లు వెల్లడించడం ఈ కౌంటర్‌కు డిమాండును పెంచింది. ప్రధానంగా ఎలక్ట్రానిక్‌ ఆర్ట్స్‌, మోటరోలా సొల్యూషన్స్‌(14 శాతం) లాభపడటంతో ఎస్‌అండ్‌పీ సైతం సానుకూలంగా ముగిసినట్లు నిపుణులు తెలియజేశారు. ఇతర కౌంటర్లలో కాటీ ఇంక్‌ 32 శాతం, మాటిల్‌ ఇంక్‌ 23 శాతం, స్కెచర్స్‌ 15 శాతం చొప్పున దూసుకెళ్లగా.. ఆర్కోనిక్  5 శాతం, హాస్‌బ్రో 1 శాతం చొప్పున డీలాపడ్డాయి.
  
ఆసియా నేలచూపు
శుక్రవారం యూరోపియన్‌ మార్కెట్లలో యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ 0.3-1 శాతం మధ్య డీలాపడ్డాయి.ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. సింగపూర్‌ 0.7 శాతం నీరసించగా, తైవాన్‌ అదే స్థాయిలో పుంజుకుంది. మిగిలిన మార్కెట్లలో చైనా, హాంకాంగ్‌ 0.2 శాతం చొప్పున బలపడగా, కొరియా, ఇండొనేసియా ఇదే స్థాయిలో బలహీనపడ్డాయి. జపాన్‌, థాయ్‌లాండ్‌ మార్కెట్లకు సెలవు. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 96.65కు చేరగా.. యూరో 1.132 వద్ద, జపనీస్‌ కరెన్సీ యెన్‌ 109.78 వద్ద కదులుతున్నాయి.Most Popular