దేశీ స్టాక్ మార్కెట్లు నేడు ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 30 పాయింట్లు క్షీణించి 10,916 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఓవైపు కార్పొరేట్ ఫలితాలు ఆకట్టుకున్నప్పటికీ.. మరోపక్క అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కార అంశంపై సందేహాలు ఇన్వెస్టర్లను అప్రమత్తం చేశాయి. దీంతో వారాంతాన అమెరికా స్టాక్ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. మరోవైపు యూరోపియన్ మార్కెట్లలో యూకే, ఫ్రాన్స్, జర్మనీ 0.3-1 శాతం మధ్య డీలాపడ్డాయి. ఈ నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు నేడు ఊగిసలాట మధ్య కదిలే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.
పతనంతో ముగింపు
మిడ్‌సెషన్ నుంచీ అమ్మకాలు పెరగడంతో శుక్రవారం దేశీ స్టాక్ మార్కెట్లు పతనంతో ముగిశాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే కట్టుబడటంతో రోజు మొత్తం మార్కెట్లు నష్టాలమధ్యే కదిలాయి. చివరి గంటలో మరింత డీలాపడ్డాయి. దీంతో నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 11,000 పాయింట్ల మైలురాయిని కోల్పోయింది. వెరసి ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 425 పాయింట్లు పతనమై 36,546 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 126 పాయింట్లు కోల్పోయి 10,943 వద్ద స్థిరపడింది. గురువారం అమెరికా, యూరొపియన్ మార్కెట్లు పతనంకావడం, ఆసియాలోనూ అమ్మకాలదే పైచేయిగా నిలవడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 10,899 పాయింట్ల వద్ద, తదుపరి 10,854 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,015 పాయింట్ల వద్ద, తదుపరి 11,086 స్థాయిలోనూ అవరోధాలు ఎదురుకావచ్చని భావిస్తున్నారు. బ్యాంక్ నిఫ్టీకి తొలుత 27,183 వద్ద, తదుపరి 27,072 వద్ద సపోర్ట్ కనిపించవచ్చని... మరోవైపు 27,445, 27,593 స్థాయిలలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని అంచనా వేశారు.
ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 844 కోట్లు ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 960 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. కాగా.. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 418 కోట్లు, దేశీ ఫండ్స్ రూ. 294 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.