గడిచిన వారం దేశీ స్టాక్ మార్కెట్లు పలుమార్లు హెచ్చుతగ్గుల మధ్య ఊగిసలాడాయి. చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. అయితే మధ్య, చిన్నతరహా కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. శుక్రవారం(8)తో ముగిసిన గత వారం సెన్సెక్స్ నికరంగా 77 పాయింట్లు(0.2 శాతం) బలపడి 36,546 వద్ద నిలిచింది. ఈ బాటలో నిఫ్టీ 50 పాయింట్లు(0.5 శాతం) పుంజుకుని 10,944 వద్ద స్థిరపడింది. అయితే నిఫ్టీ 11,000 పాయింట్ల మార్క్ దిగువన ముగిసింది.
నేలచూపులో
మార్కెట్లు నికరంగా లాభపడినప్పటికీ మిడ్, స్మాల్ క్యాప్స్ అమ్మకాలతో డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 2.2 శాతం చొప్పున నష్టపోయాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 14,329 వద్ద నిలవగా.. స్మాల్ క్యాప్ 13,657 వద్ద ముగిసింది.
టాటా మోటార్స్ కుదేల్
నిఫ్టీ దిగ్గజాలలో ఆటో రంగ బ్లూచిప్ టాటా మోటార్స్ 17 శాతం కుప్పకూలింది. క్యూ3లో భారీ నష్టాలు ప్రకటించడంతో ఇన్వెస్టర్లు ఆందోలనకు లోనైనట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ బాటలో ఐబీ హౌసింగ్, యస్ బ్యాంక్, లుపిన్, వేదాంతా, ఎల్అండ్టీ 9-5 శాతం మధ్య పతనమయ్యాయి. మరోవైపు జీ, బజాజ్ ఆటో, ఇన్ఫ్రాటెల్, టెక్ మహీంద్రా, టైటన్, ఐషర్, హీరోమోటో 12-5 శాతం మధ్య జంప్చేశాయి.
కుప్పకూలిన అడాగ్
చిన్న షేర్లలో గత వారం అడాగ్కు చెందిన రిలయన్స్ పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమ్యూనికేషన్స్, కేపిటల్, నావల్ షేర్లు 60-30 శాతం మధ్య కుప్పకూలాయి. ఈ బాటలో సుజ్లాన్, కంకార్, జేపీ, క్వాలిటీ, అదానీ పవర్, శ్రేఈ ఇన్ఫ్రా, ఐడీబీఐ బ్యాంక్, సెంట్రమ్, హెచ్డీఐఎల్, టైమ్ టెక్నో, ఐఐఎఫ్ఎల్, ఇన్ఫీబీమ్, అదానీ ఎంటర్ప్రైజెస్, గ్రాఫైట్, ఐఆర్బీ, జెట్ ఎయిర్వేస్, టాటా కెమికల్స్, వెల్స్పన్, శంకర, యూబీఐ, సిండికేట్, ఐబీ రియల్టీ 25-10 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క డిష్ టీవీ, రిలయన్స్ నిప్పన్, మన్పసంద్, గృహ ఫైనాన్స్, ఎస్ఆర్ఎఫ్, ఎండ్యూరెన్స్, మణప్పురం, దివీస్, బజాజ్ హోల్డింగ్స్, ఐసీఐసీఐ ప్రు, పీసీ జ్యువెలర్స్, టెక్స్మాకో, జూబిలెంట్ లైఫ్, మ్యాక్స్ ఫైనాన్స్, ముత్తూట్, 3ఎం ఇండియా 22-5 శాతం మధ్య దూసుకెళ్లాయి.