బడ్జెట్‌ సెషన్‌పై ఇన్వెస్టర్ల కన్ను

బడ్జెట్‌ సెషన్‌పై ఇన్వెస్టర్ల కన్ను

ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను అటు కార్పొరేట్‌ ఫలితాలు, ఇటు స్థూల ఆర్థిక గణాంకాలు ప్రభావితం చేయనున్నాయి. మరోవైపు పార్లమెంట్‌ బడ్జెట్‌ సెషన్‌కూ ప్రాధాన్యత ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ దాదాపు ముగింపునకు చేరింది. అయితే సోమవారం(11న) ఐషర్ మోటార్స్‌, 12న కోల్‌ ఇండియా, హిందాల్కో, సన్‌ ఫార్మాస్యూటికల్స్‌ క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ బాటలో ఇంధన దిగ్గజం ఓఎన్‌జీసీ, ఇంజినీరింగ్‌ బ్లూచిప్‌ బాష్‌ 14న క్యూ3 పనితీరు వెల్లడించనున్నాయి.

గణాంకాల విడుదల 
డిసెంబర్‌ నెలకు పారిశ్రామిక ప్రగతి(ఐఐపీ) వివరాలు 12న విడుదలకానున్నాయి. నవంబర్‌లో ఐఐపీ 0.5 శాతం వృద్ధికే పరిమితమైంది. ఇక ప్రభుత్వం జనవరి నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) గణాంకాలు 14న ప్రకటించనుంది. డిసెంబర్‌లో డబ్ల్యూపీఐ 3.8 శాతంగా నమోదైంది. ఇది 8 నెలల కనిష్టంకాగా.. ఇంధనం, తయారీ రంగ ఉత్పత్తుల విభాగం క్షీణించడం ఇందుకు సహకరించింది. అయితే ప్రైమరీ ఆర్టికల్స్‌ 2.3 శాతం ఎగశాయి.

Image result for Q3 results

పార్లమెంట్‌పై దృష్టి
గత నెల 31న ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్‌ సెషన్‌ సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చివరి పార్లమెంట్‌ సెషన్‌కావడంతో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడినట్లు తెలియజేశారు. బడ్జెట్‌ సెషన్‌ ఈ నెల 13వరకూ కొనసాగనుంది.

ఇతర అంశాలకూ ప్రాధాన్యం
వాణిజ్య వివాద పరిష్కార చర్చల కోసం తమ ప్రతినిధుల బృందం చైనాను సందర్శించనున్నట్లు అమెరికా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే చైనా అధినేత జిన్‌పింగ్‌ను ప్రెసిడెంట్ ట్రంప్‌ ప్రస్తుతం కలవబోరంటూ పేర్కొంది. కాగా.. మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి నిధుల విడుదలపై ట్రంప్‌ ప్రభుత్వ షట్‌డౌన్‌ను అమలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తాత్కాలికంగా షట్‌డౌన్‌కు తెరదించినప్పటికీ డెమక్రాట్లు, రిపబ్లికన్లనుంచి నిధుల విడుదలకు గ్రీన్‌సిగ్నల్ లభించవలసి ఉంది. ఈ వారం చైనా ద్రవ్యోల్బణం, జపాన్‌ పారిశ్రామికోత్పత్తి, యూఎస్ రిటైల్‌ విక్రయాలు తదితర గణాంకాలు వెలువడనున్నాయి. వీటన్నిటితోపాటు ముడిచమురు ధరలు, రూపాయి మారకం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు వంటి పలు అంశాలు ట్రెండ్‌ను ప్రభావితం చేయగలవని విశ్లేషకులు వివరించారు.Most Popular