పతనంతో ముగింపు- ఆటో, మెటల్‌ వీక్‌

పతనంతో ముగింపు- ఆటో, మెటల్‌ వీక్‌

మిడ్‌సెషన్‌ నుంచీ అమ్మకాలు పెరగడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు పతనంతో ముగిశాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే కట్టుబడటంతో రోజు మొత్తం మార్కెట్లు నష్టాలమధ్యే కదిలాయి. చివరి గంటలో మరింత డీలాపడ్డాయి. దీంతో నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 11,000 పాయింట్ల మైలురాయిని కోల్పోయింది. వెరసి ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 425 పాయింట్లు పతనమై 36,546 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 126 పాయింట్లు కోల్పోయి 10,943 వద్ద స్థిరపడింది. గురువారం అమెరికా, యూరొపియన్‌ మార్కెట్లు పతనంకావడం, ఆసియాలోనూ అమ్మకాలదే పైచేయిగా నిలవడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 

రియల్టీ ఎదురీత
ఎన్‌ఎస్‌ఈలో ఆటో, మెటల్‌ రంగాలు 3.5 శాతం చొప్పున పతనంకాగా..  పీఎస్‌యూ బ్యాంక్స్‌, మీడియా, ఎఫ్‌ఎంసీజీ 1.5 శాతం స్థాయిలో తిరోగమించాయి. క్యూ3 ఫలితాలు నిరాశపరచడంతో నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌ 18 శాతం కుప్పకూలింది. మిగిలిన బ్లూచిప్స్‌లో ఐబీ హౌసింగ్‌, గ్రాసిమ్‌, వేదాంతా, ఐషర్, టాటా స్టీల్‌, ఐవోసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ 7-3 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే మరోపక్క ఇన్‌ఫ్రాటెల్‌ 7.5 శాతం జంప్‌చేసింది. ఈ బాటలో కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 1-0.5 శాతం మధ్య బలపడ్డాయి. రియల్టీ స్టాక్స్‌లో డీఎల్‌ఎఫ్‌,  ఫీనిక్స్, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ప్రెస్టేజ్‌ 3.5-1 శాతం మధ్య పుంజుకున్నాయి.

చిన్న షేర్లు డౌన్‌
మార్కెట్లు పతనమైన నేపథ్యంలో చిన్న షేర్లలోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ 1.5 శాతం, స్మాల్‌ క్యాప్‌ 1 శాతం చొప్పున నీరసించాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1565 నష్టపోగా.. 961 మాత్రమే లాభాలతో ముగిశాయి. 

పెట్టుబడుల జోరు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 418 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 294 కోట్లు విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. బుధవారం సైతం ఎఫ్‌పీఐలు రూ. 695 కోట్లు, దేశీ ఫండ్స్‌ రూ. 525 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిదే. Most Popular