11000 దిగువకు నిఫ్టీ- దివాన్‌ డౌన్‌

11000 దిగువకు నిఫ్టీ- దివాన్‌ డౌన్‌

ప్రతికూల విదేశీ సంకేతాల నడుమ బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 11,000 పాయింట్ల కీలక మార్క్‌ దిగువకు చేరింది. గురువారం అమెరికా, యూరొపియన్‌ మార్కెట్లు పతనంకావడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపుతున్నారు. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్‌ 226 పాయింట్లు తిరోగమించింది. 36,745ను తాకింది. నిఫ్టీ సైతం 72 పాయింట్ల వెనకడుగుతో 10,998 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ ఆర్థిక మందగమన ఆందోళనల నేపథ్యంలో ఆసియాలోనూ మార్కెట్లు సైతం డీలాపడటంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమైన సంగతి తెలిసిందే.  

రియల్టీ ప్లస్‌లో
ఎన్‌ఎస్‌ఈలో ఆటో 3 శాతం పతనంకాగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌, మెటల్‌, ఫార్మా 2-1.3 శాతం మధ్య నష్టపోయాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌ 18 శాతం కుప్పకూలింది. క్యూ3 ఫలితాలు నిరాశపరచడం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మిగిలిన బ్లూచిప్స్‌లో ఐబీ హౌసింగ్‌, గ్రాసిమ్‌, వేదాంతా, ఐషర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐసీఐసీఐ, మారుతీ, డాక్టర్‌ రెడ్డీస్‌, జీ 5-2 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే ఇన్‌ఫ్రాటెల్‌ 3.3 శాతం పుంజుకోగా, బీపీసీఎల్‌, సిప్లా, ఇన్ఫోసిస్‌, కొటక్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్ 2-0.5 శాతం మధ్య బలపడ్డాయి.

Image result for dewan housing

దివాన్‌ పతనం
డెరివేటివ్స్‌లో టాటా మోటార్స్‌ డీవీఆర్‌ 15 శాతం కుప్పకూలగా.. దివాన్‌ హౌసింగ్‌, యూనియన్‌ బ్యాంక్‌, సుజ్లాన్‌, ఐడియా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పీఎన్‌బీ, ఓబీసీ 7-4.5 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. రిలయన్స్‌ కేపిటల్‌, ఆర్‌పవర్, రేమండ్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, మ్యాక్స్‌ ఫైనాన్స్, పీసీ జ్యువెలర్స్‌, హెక్సావేర్‌ 8.5-2 శాతం మధ్య ఎగశాయి. రియల్టీ స్టాక్స్‌లో ఫీనిక్స్, డీఎల్‌ఎఫ్‌, ఒబెరాయ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 2.7-0.7 శాతం మధ్య లాభపడ్డాయి.

చిన్న షేర్లు డౌన్‌
మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్న నేపథ్యంలో చిన్న షేర్లలోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ 1 శాతం, స్మాల్‌ క్యాప్‌ 0.5 శాతం చొప్పున నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1308 నష్టపోగా.. 747 మాత్రమే లాభాలతో ట్రేడవుతున్నాయి.Most Popular