ఎన్నికల వేళ.. ప్రభుత్వ బాటలో ఆర్బీఐ ! వడ్డీరేట్లలో కోత

ఎన్నికల వేళ.. ప్రభుత్వ బాటలో ఆర్బీఐ ! వడ్డీరేట్లలో కోత

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ వర్గాల అంచనాలకు తగ్గట్టే కీలక వడ్డీ రేట్లను పావు శాతం తగ్గించింది. ద్రవ్యోల్బణం అంచనాలకు కూడా అనూహ్యంగా తగ్గించడంతో పాటు వృద్ధి రేటును కూడా సవరించింది. మొత్తానికి ప్రభుత్వ లక్ష్యాలకు ఇతోధికంగా సాయం చేసిన ఆర్బీఐ.. ఎన్నికల ముందు కీలక నిర్ణయాన్ని వెలువరించింది. 
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ మూడు రోజుల భేటీలో కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత శక్తికాంత దాస్ మొదటి మీటింగ్. అందుకే రొటీన్‌కు భిన్నంగా మధ్యాహ్నం 11.45 నిమిషాలకు తమ నిర్ణయాలను ప్రకటించారు. (అంతకుముందు ఇది మధ్యాహ్నం రెండున్నరకు ఉండేది. ) ఇక రేట్ల విషయానికి వస్తే.. అంతకుముందు 6.5 శాతంగా ఉన్న రెపో రేట్‌ను 6.25 శాతానికి తగ్గించారు. (రెపో రేట్ అంటే తక్కువ కాలానికి బ్యాంకులకు రుణాలు ఇచ్చి దానిపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేట్). ఆరుగురు సభ్యుల బృందంలో నలుగురు వడ్డీ రేట్ తగ్గించడానికే మొగ్గుచూపారు. రెండు నెలల ముందు వడ్డీ రేట్లు పెంచేందుకు అవకాశం ఉందని చెప్పిన క్యాలిబరేటెడ్ టైట్నింగ్ స్టాండ్‌ను ఇప్పుడు న్యూట్రల్ (తటస్థంగా) మార్చుకుంది ఆర్బీఐ. ఇదే అందరినీ ఆశ్చర్యపరిచింది. 

ఇన్‌ఫ్లేషన్ అంచనాలను కూడా ఆర్బీఐ సవరించింది. అంతకుముందు 3.8 - 4.2 శాతం మధ్య ఉంటుందని భావించిన ద్రవ్యోల్బణం ఈ ఏడాదికి 3.2 - 3.4 శాతం మధ్య నమోదు కావొచ్చని అంచనా వేసింది. మార్కెట్లో పండ్లు, కూరగాయలు, ఆహార ధాన్యాల ధరలు అందుబాటులో ఉన్నాయనేది దీని సారాంశం. ఇది ఇలానే కొనసాగితే.. వడ్డీ రేట్లను మరోసారి సవరించవచ్చనేది ఆర్బీఐ పరోక్షంగా చెప్పిన మాట. అంతేకాకుండా జీడీపీ వృద్ధి రేట్‌ అంచనాలను ఈ ఏడాదికి 7.2 నుంచి 7.4 శాతానికి సవరించింది. 

ప్రభుత్వ నిర్ణయాలకు తగ్గట్టే ఆర్బీఐ కూడా అడుగులు వేస్తోంది అనేందుకు ఇది మరో సంకేతం. ఎలాంటి పూచీకత్తు లేకుండా రైతులకు ఇచ్చే రుణపరిమితిని లక్ష నుంచి రూ.1.6 లక్షలకు పెంచారు. దీనివల్ల ఎలాంటి కొలేటరల్ లేకుండా రైతులు రూ. 1.6 లక్షల వరకూ రుణం పొందొచ్చు. లిక్విడిటీ సమస్య ప్రస్తుతానికి సద్దుమణిగిందని, ఫిబ్రవరిలో ఇప్పటివరకూ ఎలాంటి సమస్యా రాలేదని, రాబోయే రోజుల్లోనూ ఇలాంటి ఇబ్బందులు ఉండబోవనేది ఆర్బీఐ మాట. 

వాస్తవానికి రెపో రేట్ అనేది ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేట్. ఇది తగ్గితే బ్యాంకులు కూడా తగ్గించాలి. కానీ ఇక్కడ ఖచ్చితమైన నియమేదీలేదు. ఇప్పుడు సదరు వడ్డీ రేట్లను బ్యాంకులు తగ్గిస్తేనే సామాన్యుడికి ప్రయోజనం. అప్పుడే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై ఈఎంఐల భారం తగ్గుతుంది. అంతవరకూ బ్యాంకుల నిర్ణయం కోసం మనం వేచి చూడాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది. మొదటి అడుగు ఎస్బీఐ వేస్తే మిగిలిన సంస్థలు కూడా అదే బాటపడ్తాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ..


 Most Popular