వడ్డీ రేట్లకు కీలకంగా నిలిచే రెపో రేటులో పావు శాతంమేర కోత పెట్టేందుకు మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) తాజాగా నిర్ణయించింది. దీంతో రెపో రేటు 6.25 శాతానికి చేరింది. ఫలితంగా రివర్స్ రెపో రేటు సైతం 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. ప్రస్తుతం ఎంఎస్ఎఫ్, బ్యాంక్ రేటు 6.75 శాతం నుంచి 6.5 శాతానికి దిగివచ్చింది. రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్ శక్తికాంతదాస్ అధ్యక్షతన మంగళవారం(5న) ప్రారంభమైన ఎంపీసీ పరపతి సమీక్షా సమావేశాలు నేడు ముగిశాయి. తద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19)లో ఆరో ద్వైపాక్షిక పరపతి సమీక్షను ఆర్బీపై మూడు రోజులపాటు నిర్వహించింది. 17 నెలల తరువాత కొత్త గవర్నర్ అధ్యక్షతన ఆర్బీఐ రెపో రేటులో కోత విధించడం గమనార్హం! కాగా.. గత పాలసీ సమాశాల్లో భాగంగా ఆర్బీఐ యథాతథ రేట్ల అమలుకే మొగ్గుచూపిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ రెపో రేటు 6.5 శాతంగా అమలవుతుండగా.. రివర్స్ రెపో 6.25 శాతంవద్ద కొనసాగుతోంది. ఎంఎస్ఎఫ్, బ్యాంక్ రేటు 6.75 శాతంగా అమలవుతున్నాయి. వడ్డీ రేట్లను ప్రభావితం చేసే రెపో రేటు కోత నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. సెన్సెక్స్ 170 పాయింట్లు ఎగసింది. నిఫ్టీ సైతం 50 పాయింట్లు పుంజుకుంది.
ఇతర విశేషాలు
- 2019-20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిని 7.4 శాతంగా ఆర్బీఐ అంచనా వేసింది.
- ఏప్రిల్- సెప్టెంబర్ కాలానికి వినియోగ ద్రవ్యోల్బణ రేటు అంచనా 3.2-3.4 శాతంగా ప్రకటించింది.
- దేశీ కంపెనీ రుణ ఎక్స్పోజర్కు సంబంధించి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకు అమలు చేస్తున్న 20 శాతం పరిమితిని తొలగించింది.
- హామీలేని(కొలేటరల్ ఫ్రీ) రైతు రుణ పరిమితిని రూ. 60,000 మేర పెంచింది. దీంతో ఇది రూ. 1.6 లక్షలకు చేరింది.