కార్పోరేట్ కంపెనీల నిర్వాకాలు - ఇన్వెస్టర్లకు తిప్పలు..!

కార్పోరేట్ కంపెనీల నిర్వాకాలు - ఇన్వెస్టర్లకు తిప్పలు..!

దేశీయ మార్కెట్లలో కార్పోరేట్ కంపెనీల పాలనా వైఫల్యాలు ఇన్వెస్టర్లకు సమస్యగా మారాయి. స్థిరంగా రాణిస్తున్న కంపెనీ స్టాక్స్ విషయంలో ఒక్క చెడు వాఖ్యానం మార్కెట్లలో పాకినా.. వెంటనే ఆ స్టాక్ కుప్పకూలడం సహజంగా మారింది. IL&FS, DHFL, RCOM, ఎస్సెల్ గ్రూప్, జీ ఎంటర్‌టైన్మెంట్స్ వంటి కంపెనీల విషయంలో మదుపర్లు చాలా అసహనంగా ఉన్నారనే చెప్పొచ్చు. పలు ప్రముఖ ఫండింగ్ హౌజెస్ కూడా ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఫండ్ హౌజ్‌లు పెట్టుబడి పెట్టిన కంపెనీల్లో జరిగే ప్రతి పరిణామాన్ని అవి నిశితంగా గమనిస్తూ ఉంటాయి. పెట్టుబడి పెట్టిన కంపెనీల్లో పరిపాలన, నిర్వాహణ సరిగా ఉండేలా అవి ఒత్తిడిని తీసుకోస్తాయి. కానీ.. ఈమధ్య జరిగిన పరిణామాలను పరిశీలిస్తే.. ఫండ్ మేనేజర్లు ఒకింత నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రముఖ గ్లోబల్, ఫారిన్ ఇన్వెస్టర్‌ అయిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాఖ్యానించింది. కార్పోరేట్ కంపెనీల పాలనా వైఫల్యాలు ముదపర్లకు తీవ్ర సమస్యగా మారాయని ఫ్రాంక్లిన్ పేర్కొంది. సుభాష్ చంద్ర నేతృత్వంలోని ఎస్సెల్ గ్రూప్ , వాధ్వాన్ ఆధ్వర్యంలోని DHFL, IL&FS వంటి కంపెనీల పనితీరే ఇందుకు ఉదాహరణగా ఈ ఫారిన్ ఫండ్ హౌస్ చూపుతుంది. 
నగదు లిక్విడిటీ సమస్యలను ఎదుర్కొంటున్న DHFL గత సెప్టెంబర్ నుండి పూర్తిగా పతనం కావడం ఆరంభించింది. ప్రమోటర్స్ వాటాదారులను అయోమయానికి గురిచేయడం వంటివి ఇక్కడ జరిగాయి. అలాగే జీ గ్రూప్ విషయంలో కూడా ప్రమోటర్స్ వాటాదారులను, రుణ దాతకు తమ పాలనా వైఫల్యాలను తెలియజెప్పకపోవడంతో ఆ స్టాక్స్ ఒక్కసారిగా ఒత్తిళ్ళకు లోనయ్యాయి. ఈ రెండు కంపెనీల షేర్లు దాదాపు 40 శాతం చలనానికి లోనయ్యాయి. ఇలా జరగడం ఇన్వెస్టర్లకు అతిపెద్ద ముప్పుగా మారుతుందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ భావిస్తోంది.
 ఇప్పటికే విదేశీ ఇన్వెస్టర్లు (FIIs) , ఫారిన్ ఫండ్ హౌసెస్  ఇలాంటి  కంపెనీల్లోని తమ వాటాలను వెనక్కి తీసుకున్నాయి. దేశీయ మార్కెట్లు రానున్న ఎన్నికల తరువాతే స్థిరంగా మారుతాయని ఫ్రాంక్లిన్ సంస్థ భావిస్తుంది. అప్పటిదాకా అస్ధిరత కనబడొచ్చని,  కార్పోరేట్ కంపెనీల నిర్వాహణ, పాలనలో వివాదస్పదంగా ఏదైనా కనిపిస్తే.. ఆస్టాక్స్ ను వదిలించుకోడమే మంచిదని ఫ్రాంక్లిన్ తన ఇన్వెస్టర్లకు సూచిస్తుంది. ఎన్నికల తరువాత సుస్థిర ప్రభుత్వం ఏర్పడక పోతే.. లేదా సంకీర్ణం వస్తే.. మార్కెట్లు ఇంకా అస్థిరంగా మారుతాయని బ్రోకింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. దేశీయ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs) కూడా ఎన్నికల రిజల్ట్ వచ్చాకే తిరిగి మార్కెట్లలోకి ప్రవేశిస్తారని ఫ్రాంక్లిన్ పేర్కొంది. పాలనాపరమైన వైఫల్యాలను ఎదుర్కొన్న కంపెనీలను పక్కన బెడితే.. దేశీయమార్కెట్లలో ఆటో, ఫైనాన్షియల్ సెక్టార్  మంచి ఫలితాలనే చూపుతున్నాయి. కానీ.. ఇన్ఫ్రా, హెల్త్‌ కేర్ , క్యాపిటల్ గూడ్స్ వంటి రంగాలు  మందగమనంలోనే ఉన్నాయని బ్రోకరేజ్ సంస్థలు పేర్కొంటున్నాయి. ఎన్నికలకు తరువాతే స్మాల్ క్యాప్ , మిడ్ క్యాప్ రంగాలు పుంజుకునే అవకాశాలున్నాయని, ఒక వేళ కంపెనీల పాలనా వైఫల్యాలు ఇంకా కొనసాగితే.. ముదుపర్లు మార్కెట్లను వీడటం ఖాయమని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ హెచ్చరిస్తుంది. 
 Most Popular