ఉజ్జీవన్‌ జూమ్‌- ఎడిల్‌వీజ్‌కు నీరసం

ఉజ్జీవన్‌ జూమ్‌- ఎడిల్‌వీజ్‌కు నీరసం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసికలో ఆకర్షణీయ ఫలితాలు సాధించిన ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ కౌంటర్‌ కన్సాలిడేషన్‌ మార్కెట్లోనూ లాభాలతో కళకళలాడుతుంటే.. పనితీరు నిరాశపరచిన కారణంగా ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వివరాలు చూద్దాం...

ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ 
ఈ ఏడాది క్యూ3(అక్టొబర్‌-డిసెంబర్‌)లో ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ నికర లాభం 54 శాతం వృద్ధితో రూ. 45 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం సైతం 30 శాతం ఎగసి రూ. 255 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 11.8 శాతంగా నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 1.4 శాతంకాగా.. నికర ఎన్‌పీఏలు 0.3 శాతం వద్దే నిలిచాయి. దీంతో ఈ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌  షేరు 6.4 శాతం జంప్‌చేసి రూ. 302 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 306 వద్ద గరిష్టాన్నీ, రూ. 289 వద్ద కనిష్టాన్నీ తాకింది. 

Image result for edelweiss financial services

ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ 
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్)లో ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ నికర లాభం 4 శాతం క్షీణించి రూ. 226 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం 26 శాతం పుంజుకుని రూ. 2776 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ కౌంటర్‌ అమ్మకాలతో నీరసించింది.  ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు దాదాపు 4 శాతం పతనమై రూ. 154 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 162-153 మధ్య ఊగిసలాడింది.