రూ.20 బ్రోకరేజ్ సంస్థ దేశంలో నెంబర్ ఒన్ ఎలా అయిందంటే

రూ.20 బ్రోకరేజ్ సంస్థ దేశంలో నెంబర్ ఒన్ ఎలా అయిందంటే

దేశీయ మార్కెట్లలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీల్లో ఆన్ లైన్ డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థ అయిన జిరోధా  ముందుంటుంది. వ్యాపార నిర్వాహణలో అడ్డంకులను అధిగమించేలా సేవలను అందించే ఈ జిరోధా ప్రస్థానం 2010లో మొదలైంది. బెంగుళూరుకు  చెందిన నితిన్ కామత్ , నిఖిల్ కామత్‌ల ఆధ్వర్యంలో కేవలం 5గురు ఉద్యోగులతో మొదలు పెట్టిన జిరోధా కంపెనీ కాల క్రమంలో ఎదుగుతూ.. 1300 మంది ఉద్యోగులతో , 8.47 లక్షల యాక్టివ్ క్లైంట్లతో దిన దిన ప్రవర్ధమానమైంది. దేశంలో అతి పెద్ద బ్రోకరేజ్ సంస్థ అయిన ICICI సెక్యూరిటీస్‌ను తోసి రాజని దేశంలోనే అతిపెద్ద బ్రోకరేజ్ సంస్థగా అవతరించింది .  జిరోధా వేదికగా ప్రతిరోజూ 30 లక్షల మంది ట్రేడింగ్ జరుపుతున్నారు. ప్రతి నెలా సగటున 50,000 నుండి 75,000 ఎకౌంట్లు జిరోధా బ్రోకరేజ్ సంస్థలో చేరుతున్నాయి. 2010లో మొదలు పెట్టిన ఈ జిరోధా బ్రోకరేజ్ సంస్థ దేశంలోని తొలి డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థగా ప్రారంభమైంది. మిగతా బ్రోకరేజ్ సంస్థలతో పోలిస్తే.. డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థలు వినియోగ దారులకు కేవలం ట్రేడింగ్‌ను మాత్రమే చేసిపెడతాయి. డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థలు కస్టమర్లకు రీసెర్చ్ సర్వీసులు, సలహాలు , బై , సెల్ కాల్స్ వంటివి ఇవ్వవు. కస్టమర్ల ట్రేడింగ్ ముగిసాక..స్వల్ప మొత్తంలోనే ఛార్జీలు వసూలు చేస్తాయి. ఫుల్ సర్వీస్ బ్రోకరేజ్ సంస్థలు మాత్రం తమ వినియోగదారులకు మార్కెట్ల స్థితిగతులపై సలహాలు, రికమండేషన్స్ ను ఇస్తాయి. లో బ్రోకరేజ్ సుంకాలతో తొందరగా కస్టమర్లను ఆకట్టుకున్న సంస్థ జిరోధా మాత్రమే అని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటారు. " విశ్వసనీయత, పారదర్శకత వంటివి ఏ ఆర్ధిక సేవల వ్యాపారానికైనా కీలకమని ", అవే మేం పాటించే సూత్రాలని జిరోధా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ అంటున్నారు.2010లో సంస్థ ప్రారంభమైనప్పుడు 3000 ఎకౌంట్లను తెరిచామని , అవి ఇప్పుడు 2018 చివరి నాటికి 8.47 లక్షల యాక్టివ్ ఎకౌంట్లకు పెరిగాయని కామత్ పేర్కొన్నారు. 

 Image result for zerodha broking
సరళీకృత విధానాలు , అతి తక్కువ సర్ ఛార్జీలు, అదనపు సేవల వంటి ఫీచర్లతో అతి తక్కువ కాలంలోనే ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది జెరోధా. 2016 ఆర్ధిక సంవత్సరంలో జెరోధాకు 61,970 మంది కస్టమర్లు ఉండగా, 2019 ఆర్ధిక సంవత్సరం (9 నెలల కాలానికి ) ఆ సంఖ్య 84,7,016 కు చేరింది. మిగతా బ్రోకరేజ్ సంస్థల్లా కాకుండా జిరోధా తన కస్టమర్లకు ఫ్లాట్ రుసుము కేవలం రూ. 20 మాత్రమే వసూలు చేస్తుంది. మిగత కంపెనీలు ట్రేడింగ్ వాల్యూమ్, స్టాక్ ధరలకనుగుణంగా ఛార్జీలు వసూలు చేస్తాయి. గతంలో జిరోధా కంపెనీ  రిటైల్ ఇన్వెస్టర్లకు సలహాలు , సూచనలు ఇవ్వకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది. ఇన్వెస్టర్లు అడిగే సూచనలు ఇవ్వలేక పోవడం, బై , సెల్ ఆప్షన్లు ఇవ్వకపోవడం వంటి విషయాలు ప్రధాన అవరోధాలుగా మారాయి. ఈ సమస్యకు పరిష్కారంగా కామత్ సోదరులు ట్రేడింగ్ కశ్చన్‌ అండ్ ఆన్సర్స్ పేరిట ఒక మాడ్యూల్‌ను ప్రారంభించారు. ఇది ఇన్వెస్టర్లను ఎంతగానో ఆకట్టుకుంది. Z కనెక్ట్ పేరిట ఇంటారక్టివ్ బ్లాగ్‌ను కూడా వారు ప్రారంభించడంతో ఇన్వెస్టర్లు జిరోధా వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. దీంతో దేశంలోనే అతి పెద్ద బ్రోకరేజ్ సంస్థగా జిరోధా నిలిచింది. జిరోధా పేరు కూడా " జీరో", " రోధా"(సంస్కృత పదం) నుండి తీసుకున్నారు కామత్ బ్రదర్స్. రోధా అంటే అవరోధాలని, అవి జీరో స్థాయికి తీసుకురావడమే తమ వ్యాపార లక్ష్యం కాబట్టి .. జిరోధా అన్న పేరును ఖరారు చేసామని కామత్ బ్రదర్స్ పేర్కొన్నారు. 

Image result for zerodha broking kamath brothers
క్రమంగా తమ వ్యాపారాన్ని ట్రేడింగ్‌లో కొత్త పుంతలు తొక్కే విధంగా విస్తరించనున్నామని, ఇప్పటికే.. కేవలం 10శాతం రుసుముతో అనేక సేవలను అందుబాటులోకి తెచ్చామని నిఖిల్ కామత్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా కాయిన్ అనే సేవలను ప్రారంభించింది. దీని ద్వారా నేరుగా కస్టమర్లు మ్యూచువల్ ఫండ్స్ ను కొనుగోలు చేయొచ్చు. రానున్న రోజుల్లో మరో 5-10 లక్షల కస్టమర్లను సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుంది జిరోధా. Most Popular