ఇక ఫలితాలూ, గణాంకాల ఎఫెక్ట్‌

ఇక ఫలితాలూ, గణాంకాల ఎఫెక్ట్‌

ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను ప్రధానంగా కార్పొరేట్‌ ఫలితాలూ, ఆర్థిక గణాంకాలూ నిర్దేశించనున్నాయి. వారాంతాన(11న) మార్కెట్లు ముగిశాక ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ ఈ ఏడాది(2018-19) మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. దీంతో సోమవారం ఈ కౌంటర్‌ యాక్టివ్‌గా ట్రేడయ్యే అవకాశముంది. ఇప్పటికే టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ తదితర కంపెనీలు క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) పనితీరు వెల్లడించగా.. ఈ వారం మరికొన్ని కార్పొరేట్‌ దిగ్గజాల ఫలితాలు వెల్లడికానున్నాయి.

Related image

క్యూ3 జాబితా ఇలా
మీడియా బ్లూచిప్‌ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ మంగళవారం(15న) ఫలితాలు ప్రకటించనుండగా.. ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌, ఇంధన రంగ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 17న అక్టోబర్‌-డిసెంబర్‌ పనితీరు వెల్లడించనున్నాయి. ఈ బాటలో ఐటీ సేవల బ్లూచిప్ విప్రో 18న ఫలితాలు విడుదల చేయనుంది. కాగా.. ఇన్ఫోసిస్‌ ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయంలో 8.5-9 శాతం వృద్ధిని సాధించనున్నట్లు ఫలితాల విడుదల సందర్భంగా అంచనా వేసింది. నిర్వహణ లాభ మార్జిన్లు 22-24 శాతం స్థాయిలో నమోదుకాగలవని అభిప్రాయపడింది.

Image result for industrial production

ధరలూ, ఐఐపీ కీలకం
నవంబర్‌ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు 11న విడుదలయ్యాయి. 2017 జూన్‌ తరువాత అత్యంత కనిష్టస్థాయిలో 0.5 శాతమే వృద్ధి నమోదైంది. ప్రధానంగా తయారీ రంగం తిరోగమించడంతో పారిశ్రామికోత్పత్తి గణాంకాలపై ప్రతికూల ప్రభావం పడినట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. తయారీ రంగం 10 శాతం వృద్ధిని వీడి ప్రతికూల(-0.4 శాతం) బాట పట్టడం ఐఐపీని దెబ్బతీసింది. అక్టోబర్‌లో ఐఐపీ 8.1 శాతం ఎగసింది. విశ్లేషకులు నవంబర్‌లో 4.1 శాతం ఐఐపీని అంచనా వేశారు. కాగా.. డిసెంబర్‌ నెలకు టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ వివరాలు 14 వెల్లడికానున్నాయి.

వీటికీ ప్రాధాన్యం
డిసెంబర్‌ నెలకు చైనా, నవంబర్ నెలకు అమెరికా వాణిజ్య గణాంకాలు 14న విడుదలకానున్నాయి. వీటితోపాటు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలరుతో రూపాయి మారకం, ముడిచమురు ధరలు వంటి పలు అంశాలు మార్కెట్లకు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. Most Popular