ఇన్ఫోసిస్‌ గైడెన్స్‌ ఓకే- షేరు ఎలా?

ఇన్ఫోసిస్‌ గైడెన్స్‌ ఓకే- షేరు ఎలా?

ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో వార్షిక ప్రాతిపదికన 30 శాతం తక్కువగా రూ. 3610 కోట్ల నికర లాభం ఆర్జించింది. త్రైమాసిక ప్రాతిపదికన ఇది 12 శాతం క్షీణతకాగా.. ఇందుకు రూ. 1522 కోట్లమేర కేటాయించిన పన్ను వ్యయాలు కారణమయ్యాయి. దీనికితోడు పనాయా, స్కావా కారణంగా మరో రూ. 539 కోట్లను కోల్పోవడం లాభదాయకతను దెబ్బతీసినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఆదాయం మాత్రం 20 శాతంపైగా ఎగసి రూ. 21,400 కోట్లను తాకింది. త్రైమాసిక ప్రాతిపదికన ఇది దాదాపు 3 శాతం వృద్ధి. డాలర్ల రూపేణా ఆదాయం మరింత అధికంగా 8.4 శాతం పెరిగి దాదాపు 3 బిలియన్‌ డాలర్లకు చేరింది.  కన్సాలిడేటెడ్‌ ఫలితాలివి.

డిజిటల్‌ జోరు
ఆదాయాల్లో డిజిటల్‌ విభాగం నుంచి దాదాపు 32 శాతం అంటే 942 మిలియన్‌ డాలర్లమేర సమకూరినట్లు ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్‌ పరేఖ్‌ పేర్కొన్నారు. వార్షిక ప్రాతిపదికన డిజిటల్‌ విభాగం 33 శాతం వృద్ధిని చూపినట్లు తెలియజేశారు. ఇదే విధంగా ఆదాయంలో 32.5 శాతం వాటా కలిగిన ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ బిజినెస్‌ సైతం త్రైమాసిక ప్రాతిపదికన 3 శాతం పుంజుకున్నట్లు తెలియజేశారు. ఈ త్రైమాసికంలో 1.57 బిలియన్‌ డాలర్ల భారీ డీల్స్‌ను సాధించడం ద్వారా వచ్చే ఏడాది పనితీరుపై విశ్వాసం పెరిగినట్లు వివరించారు. కాగా.. ఇన్ఫోసిస్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2018-19) ఆదాయంలో 8.5-9 శాతం వృద్ధిని సాధించనున్నట్లు ఫలితాల విడుదల సందర్భంగా అంచనా వేసింది. నిర్వహణ లాభ మార్జిన్లు 22-24 శాతం స్థాయిలో నమోదుకాగలవని అభిప్రాయపడింది. 

Image result for equity buyback

బైబ్యాక్‌, డివిడెండ్‌
వాటాదారులకు షేరుకి రూ. 4 చొప్పున డివిడెండ్‌ చెల్లింపునకు ఇన్ఫోసిస్‌ బోర్డు ఆమోదించింది. ఇందుకు ఈ నెల 25 రికార్డ్‌ డేట్‌గా నిర్ణయించింది. అంతేకాకుండా సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బైబ్యాక్‌లో భాగంగా షేరుకి రూ. 800 ధర మించకుండా 2.36 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. వెరసి 10.32 కోట్ల షేర్ల కొనుగోలుకి రూ. 8,260 కోట్లవరకూ వెచ్చించనుంది. శుక్రవారం మార్కెట్లు ముగిశాక కంపెనీ ఫలితాలు విడుదల చేసింది. సోమవారం ఈ కౌంటర్‌పై ఫలితాల ప్రభావం కనిపించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వారాంతాన ఎన్‌ఎస్‌ఈలో ఇన్ఫోసిస్‌ షేరు 0.7 శాతం బలపడి రూ. 684 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 685-673 మధ్య ఊగిసలాడింది.Most Popular