ఫ్లెక్సీటఫ్‌, ఏజీసీ- రెండో రోజూ జోరు

ఫ్లెక్సీటఫ్‌, ఏజీసీ- రెండో రోజూ జోరు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో ఫ్లెక్సీటఫ్‌ వెంచర్స్‌ ఇంటర్నేషనల్‌ కౌంటర్‌ వరుసగా రెండో రోజు వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో మరోసారి 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. మరోపక్క బ్లాక్‌బాక్స్‌ కార్పొరేషన్‌ కొనుగోలు ప్రక్రియను పూర్తిచేసినట్లు వెల్లడించడంతో ఏజీసీ నెట్‌వర్క్స్‌ కౌంటర్‌ సైతం నష్టాల మార్కెట్లోనూ వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వివరాలు చూద్దాం...

ఫ్లెక్సీటఫ్‌ వెంచర్స్‌
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ఫ్లెక్సీటఫ్‌ వెంచర్స్‌ నికర లాభం 6 రెట్లు ఎగసి రూ. 8.6 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 19 శాతం పెరిగి రూ. 316 కోట్లను అధిగమించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఫ్లెక్సీటఫ్‌ వెంచర్స్‌ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 54.60 వద్ద ఫ్రీజయ్యింది. గురువారం సైతం ఈ షేరు 5 శాతం ఎగసి రూ. 52 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ఎఫ్‌ఐబీసీ, జియో టెక్స్‌టైల్‌ ఫ్యాబ్రిక్‌ తదితరాల తయారీలో ఉన్న ఈ కంపెనీలో ప్రమోటర్లకు 32.88 శాతం వాటా ఉంది. 

Related image

ఏజీసీ నెట్‌వర్క్స్‌
అనుబంధ సంస్థ ద్వారా యూఎస్‌ కంపెనీ బ్లాక్‌బాక్స్‌ కార్పొరేషన్‌ను సొంతం చేసుకున్నట్లు ఏజీసీ నెట్‌వర్క్స్‌ పేర్కొంది. డిజిటల్ సొల్యూషన్స్‌ అందించే బ్లాక్‌బాక్స్‌ కొనుగోలు ప్రక్రియను పూర్తిచేసినట్లు తెలియజేసింది. దీంతో 25కుపైగా దేశాలలో కార్యకలాపాలు విస్తరించేందుకు వీలు చిక్కినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్‌ఈలో ఏజీసీ షేరు 2.3 శాతం పెరిగి రూ. 120 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 128ను సైతం అధిగమించింది. కాగా.. గురువారం ఈ షేరు 10 శాతం జంప్‌చేసి రూ. 117 వద్ద ముగిసింది.Most Popular