నష్టాలవైపు చూపు -ఐటీ, రియల్టీ వీక్

నష్టాలవైపు చూపు -ఐటీ, రియల్టీ వీక్

ప్రపంచ మార్కెట్ల అండతో సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలలోకి ప్రవేశించాయి. స్వల్పస్థాయిలో ఆటుపోట్లకు లోనవుతూ భారీ నష్టాలవైపు కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 150 పాయింట్లు క్షీణించి 35,956ను తాకింది. తద్వారా 36,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరింది. నిఫ్టీ 42 పాయింట్లు క్షీణించి 10,779 వద్ద ట్రేడవుతోంది. హెచ్చుతగ్గులు చవిచూసినప్పటికీ వరుసగా ఐదో రోజు అమెరికా స్టాక్ మార్కెట్లు లాభపడిన నేపథ్యంలో తొలుత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. ఆసియాలోనూ అన్ని మార్కెట్లూ లాభపడటంతో దేశీయంగా సెంటిమెంటు బలపడింది. అయితే ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు ప్రస్తుతం వెనకడుగు వేస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు.  

మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ అప్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ 0.5 శాతం చొప్పున పుంజుకోగా.. రియల్టీ, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1.5-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. మెటల్‌ కౌంటర్లలో హిందాల్కో, ఎన్‌ఎండీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, జిందాల్‌ స్టీల్‌, వేదాంతా, హింద్‌ కాపర్‌ 2-1 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐటీ షేర్లు టీసీఎస్‌, మైండ్‌ట్రీ, టాటా ఎలక్సీ, నిట్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌ 2-0.4 శాతం మధ్య క్షీణించాయి. ఇక రియల్టీ కౌంటర్లలో శోభా దాదాపు 4 శాతం పతనంకాగా.. డీఎల్‌ఎఫ్‌, ఒబెరాయ్‌, ప్రెస్టేజ్‌, ఇండియాబుల్స్‌, సన్‌టెక్‌ 1.7-0.7 శాతం మధ్య వెనకడుగు వేశాయి. 

బ్లూచిప్స్‌ ఇలా
నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్, ఇన్‌ఫ్రాటెల్‌, ఎయిర్‌టెల్‌, ఎంఅండ్ఎం, గెయిల్‌, అదానీ పోర్ట్స్‌, ఆర్‌ఐఎల్‌ 2-0.8 శాతం మధ్య నష్టపోయాయి. అయితే ఐటీసీ, యూపీఎల్‌,  ఓఎన్‌జీసీ, ఐవోసీ, గ్రాసిమ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌పీసీఎల్‌ 1.4-0.4 శాతం మధ్య పుంజుకున్నాయి. 

Image result for psu banks

పీఎస్‌యూ బ్యాంక్స్‌ వీక్‌
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో అలహాబాద్‌ బ్యాంక్‌, శ్రీ సిమెంట్‌, బీవోబీ, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, శ్రేఈ ఇన్‌ఫ్రా, ఐడీఎఫ్‌సీ 3.3-2.2 శాతం మధ్య క్షీణించాయి. కాగా మరోవైపు సీఈఎస్‌సీ, ఐసీఐసీఐ ప్రు, జెట్‌ ఎయిర్‌వేస్‌, గాడ్‌ఫ్రే ఫిలిప్, రెప్కో హోమ్‌, ఎన్‌ఎండీసీ, టొరంట్‌ ఫార్మా 2-1 శాతం మధ్య ఎగశాయి. 

చిన్న షేర్లు డౌన్‌
మార్కెట్లు లాభాల నుంచి నష్టాలలోకి ప్రవేశించిన నేపథ్యంలో చిన్న షేర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ 0.4 శాతం, స్మాల్‌ క్యాప్‌ 0.2 శాతం చొప్పున డీలాపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1108 నష్టపోగా.. 997 లాభాలతో ట్రేడవుతున్నాయి.



Most Popular