ఎవరెడీ దూకుడు- హిమాచల్‌ అప్‌

ఎవరెడీ దూకుడు- హిమాచల్‌ అప్‌

కంపెనీలో ప్రమోటర్ల వాటాను విక్రయించే ప్రణాళికల్లో ఉన్నట్లు వార్తలు వెలువడటంతో ఎవరెడీ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో కన్సాలిడేషన్‌ మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తోంది. మరోవైపు తాజాగా రెండు కాంట్రాక్టులను పొందినట్లు వెల్లడించడంతో హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్‌ కమ్యూనికేషన్స్‌(హెచ్‌ఎఫ్‌సీఎల్‌) కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వివరాలు చూద్దాం...

ఎవరెడీ ఇండస్ట్రీస్‌
డైవర్సిఫైడ్‌ బిజినెస్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎవరెడీ ఇండస్ట్రీస్‌లో కంపెనీలో అతిపెద్ద వాటాదారు విలియమ్‌సన్ మేజర్‌ వాటాను విక్రయించే ప్రణాళికల్లో ఉన్నట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. విక్రయ డీల్‌ నిర్వహణకు కొటక్‌ మహీంద్రా బ్యాంకును ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. విలియమ్‌సన్‌ మేజర్‌ 45 శాతం వాటాను విక్రయించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎవరెడీ ఇండస్ట్రీస్‌ కౌంటర్లో ట్రేడింగ్‌ పరిమాణం సైతం జోరందుకుంది. గత 20 రోజుల సగటుతో పోలిస్తే 200 రెట్లు లావాదేవీలు ఇప్పటివరకూ నమోదయ్యాయి. కాగా.. ప్రస్తుతం ఎన్ఎస్‌ఈలో ఎవరెడీ షేరు 14 శాతం దూసుకెళ్లింది. రూ. 207 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 214 వద్ద గరిష్టాన్నీ, రూ. 192 వద్ద కనిష్టాన్నీ తాకింది.

Related image

హెచ్‌ఎఫ్‌ఎసీఎల్‌
దాదాపు రూ. 503 కోట్ల విలువైన రెండు ఆర్డర్లను పొందినట్లు హిమాచల్‌ ఫ్యూచరిస్టిక్‌ కమ్యూనికేషన్స్‌ తాజాగా వెల్లడించింది. ఇంజినీరింగ్‌ దిగ్గజం ఎల్‌అండ్‌టీ, పీఎస్‌యూ సంస్థ ఐటీఐ కన్సార్షియం నుంచి వీటిని పొందినట్లు పేర్కొంది. భారత్‌నెట్‌ రెండో దశలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలలో ఓఎఫ్‌సీ మౌలికసదుపాయాల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయవలసి ఉంటుందని తెలియజేసింది. ఎల్‌అండ్‌టీ నుంచి లభించిన కాంట్రాక్టు విలువ రూ. 148 కోట్లుకాగా.. మేలోగా పూర్తిచేయవలసి ఉన్నట్లు వివరించింది. ఐటీఐ కన్సార్షియం నుంచి లభించిన రూ. 355 కోట్ల విలువైన కాంట్రాక్టును అక్టోబర్‌కల్లా ఎగ్జిక్యూట్‌ చేయవలసి ఉన్నదని తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌ఎఫ్‌సీఎల్‌ షేరు 4 శాతం ఎగసి రూ. 24 వద్ద ట్రేడవుతోంది. గత 20 రోజుల సగటుతో పోలిస్తే ట్రేడింగ్ పరిమాణం సైతం 8 రెట్లు పెరిగింది.Most Popular