ఐదో రోజూ లాభాల్లో -మెకీస్‌ పతనం!

ఐదో రోజూ లాభాల్లో -మెకీస్‌ పతనం!

ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ మిశ్రమ సంకేతాలు ఇవ్వడం..  రిటైల్‌ దిగ్గజం మెకీస్‌ నిరుత్సాహకర గైడెన్స్‌ తదితర ప్రతికూల అంశాల నేపథ్యంలోనూ అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. అయితే మరోసారి ఊగిసలాటకు లోనయ్యాయి. చివరికి గురువారం డోజోన్స్‌ 123 పాయింట్లు(0.5 శాతం) ఎగసి 24,002 వద్ద నిలిచింది. ఈ బాటలో ఎస్‌అండ్‌పీ 12 పాయింట్లు(0.45 శాతం) పుంజుకుని 2,597 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ సైతం 29 పాయింట్లు(0.4 శాతం) బలపడి 6,986 వద్ద స్థిరపడింది. వెరసి వరుసగా ఐదో రోజు లాభాలతో నిలిచాయి. ఫలితంగా క్రిస్మస్‌ పండుగ సమయంలో నమోదైన కనిష్టం నుంచి ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ 10 శాతం ర్యాలీ చేసింది.

Image result for american airlines

పావెల్‌ కామెంట్స్‌
వడ్డీ రేట్ల పెంపును చేపట్టేందుకు సహనంతో వేచిచూడనున్నట్లు ఫెడ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ తాజాగా పేర్కొన్నారు. బ్యాంక్‌ బ్యాలన్స్‌షీట్‌ను భారీగా తగ్గించవలసి ఉన్నదని స్పష్టం చేశారు. యూఎస్‌ రుణభారంపై ఆందోళన వ్యక్తం చేశారు. మరోపక్క డిసెంబర్‌లో డిమాండ్‌ మందగించిన కారణంగా మెకీస్‌ ఇండక్‌ నిరుత్సాహకర గైడెన్స్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మార్కెట్లు తొలుత వెనకడుగువేశాయి. మెకీస్‌ షేరు దాదాపు 18 శాతం కుప్పకూలింది. కాగా.. ఎట్టకేలకు కేసీ-46 ఎయిర్‌ ట్యాంకర్‌ను  అమెరికన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఆమోదించడంతో బోయింగ్‌ కంపెనీ  2.5 శాతం పుంజుకుంది. అయితే నాలుగో క్వార్టర్‌ ఆదాయ అంచనాలలో కోత పెట్టడంతో అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌ 4.2 శాతం పతనమైంది.

ఆసియా ఓకే
గురువారం యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. యూకే 0.5 శాతం, జర్మనీ 0.25 శాతం చొప్పున బలపడ్డాయి. ఫ్రాన్స్‌ 0.15 శాతం నీరసించింది. ప్రస్తుతం ఆసియాలో జపాన్‌, తైవాన్‌, కొరియా,  సింగపూర్‌, ఇండొనేసియా 0.7-0.3 శాతం మధ్య ఎగశాయి. ఈ బాటలో  హాంకాంగ్, థాయ్‌లాండ్‌, చైనా నామమాత్ర లాభాలతో ట్రేడవుతున్నాయి. Most Popular