చివరికి నష్టాలే- బ్యాంక్స్‌, రియల్టీ వీక్‌

చివరికి నష్టాలే- బ్యాంక్స్‌, రియల్టీ వీక్‌

పలు కార్పొరేట్‌ సంస్థలు నిరుత్సాహకర గైడెన్స్‌ ప్రకటించడంతోపాటు.. వచ్చే వారం బ్రెక్సిట్‌పై కీలక వోటింగ్‌ జరగనున్న నేపథ్యంలో యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం యూకే 0.4 శాతం, ఫ్రాన్స్‌ 0.6 శాతం, జర్మనీ 0.75 శాతం చొప్పున వెనకడుగు వేశాయి. కాగా.. మరోపక్క నేలచూపులతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం చివరివరకూ బలహీనంగానే కదిలాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమివ్వడంతో ఏ దశలోనూ కోలుకున్నట్లు కనిపించలేదు. వెరసి ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 106 పాయింట్లు క్షీణించి 36,107 వద్ద నిలవగా.. నిఫ్టీ 34 పాయింట్లు బలహీనపడి 10,822 వద్ద స్థిరపడింది.

Related image

బ్లూచిప్స్‌ తీరిలా
ఎన్‌ఎస్‌ఈలో ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 1 శాతం క్షీణించగా.. రియల్టీ 0.3 శాతం నీరసించింది. అయితే ఆటో, ఫార్మా 0.3 శాతం చొప్పున బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌పీసీఎల్‌, ఇండస్‌ఇండ్, గ్రాసిమ్‌, ఇన్‌ఫ్రాటెల్‌, మారుతీ, కొటక్‌ బ్యాంక్‌, ఐవోసీ, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌ 3-1.4 శాతం మధ్య డీలాపడ్డాయి. ఇతర బ్లూచిప్స్‌లో టైటన్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఆటో, ఐషర్‌, ఎన్‌టీపీసీ, సిప్లా, ఎంఅండ్‌ఎం, యూపీఎల్‌, యస్‌ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌ 1.6-0.75 శాతం మధ్య పుంజుకున్నాయి.  

చిన్న షేర్లు ప్లస్‌లో
మార్కెట్లు బలహీనంగా ముగిసిన నేపథ్యంలోనూ చిన్న షేర్లకు కొంతమేర డిమాండ్‌ కనిపించింది. దీంతో బీఎస్ఈలో మిడ్‌ క్యాప్స్‌ 0.5 శాతం బలపడ్డాయి. అయితే ట్రేడైన మొత్తం షేర్లలో 1372 నష్టపోగా.. 1227 లాభాలతో ముగిశాయి.

రెండువైపులా కొనుగోళ్లు 
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 276 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 440 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా..  మంగళవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 534 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌ రూ. 698 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. Most Popular