కన్సాలిడేషన్‌లో- బ్యాంక్స్‌ వీక్‌

కన్సాలిడేషన్‌లో- బ్యాంక్స్‌ వీక్‌

వరుసగా నాలుగో రోజు అమెరికా స్టాక్ మార్కెట్లు లాభపడినప్పటికీ దేశీయంగా సెంటిమెంటు బలహీనపడింది. ఇందుకు ముడిచమురు ధరలు మండుతుండటం, రూపాయి నీరసిస్తుండటం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 51 పాయింట్లు క్షీణించి 36,162కు చేరగా.. నిఫ్టీ 18 పాయింట్లు బలహీనపడి 10,837 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు పరిష్కారమయ్యే సంకేతాల నేపథ్యంలో బుధవారం యూరప్‌ మార్కెట్లు లాభపడగా.. ప్రస్తుతం ఆసియాలో అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది.  

రియల్టీ అప్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా బ్యాంక్‌ నిఫ్టీ 0.5 శాతం వెనకడుగువేయగా.. రియల్టీ 0.5 శాతం బలపడింది. రియల్టీ స్టాక్స్‌లో యూనిటెక్‌, ప్రెస్టేజ్‌, శోభా, డీఎల్‌ఎఫ్‌, ఫీనిక్స్‌, ఇండియాబుల్స్‌ 2.5-0.5 శాతం మధ్య పెరిగాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, యూపీఎల్‌, సిప్లా, ఐషర్‌, అదానీ పోర్ట్స్‌, ఇన్ఫోసిస్‌, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, యస్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌ 1.2-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి. బ్లూచిప్స్‌లో ఇన్ఫ్రాటెల్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఇండస్‌ఇండ్, యాక్సిస్‌, ఐవోసీ, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్‌గ్రిడ్‌, విప్రో, సన్‌ ఫార్మా 2.5-0.65 శాతం మధ్య డీలాపడ్డాయి. 

Related image

డెరివేటివ్స్‌ తీరిలా
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో జీఎంఆర్‌, దివీస్‌ లేబ్స్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, ఆర్‌ఈసీ, జీఎస్‌ఎఫ్‌సీ, అమరరాజా, ఐసీఐసీఐ ప్రు, అశోక్‌ లేలాండ్‌, కర్ణాటక బ్యాంక్‌ 2-1 శాతం మధ్య ఎగశాయి. కాగా మరోవైపు మెక్‌డోవెల్‌, ఇండిగో, ఐడీబీఐ, చెన్నై పెట్రో, భారత్‌ ఫైనాన్స్‌ 2.6-1.2 శాతం మధ్య క్షీణించాయి.

చిన్న షేర్లు ప్లస్‌లో
మార్కెట్లు బలహీనంగా ప్రారంభమైనప్పటికీ చిన్న షేర్లకు డిమాండ్‌ పుట్టింది. ప్రస్తుతం బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.3 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 803 లాభపడగా.. 572 మాత్రమే నష్టాలతో ట్రేడవుతున్నాయి.Most Popular