చలిలోనూ చమురు మంట- రుపీకి సెగ

చలిలోనూ చమురు మంట- రుపీకి సెగ

దేశీయంగా శీతలగాలులతో కూడిన చలి వణికిస్తున్నప్పటికీ విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు మండుతున్నాయి. దీంతో దేశీయంగా మరోసారి రూపాయికి చమటలు పడుతున్నాయి. గత 8 రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ముడిచమురు ధరలు బుధవారం ఒక్కసారిగా 5 శాతం జంప్‌చేశాయి. బ్రెంట్‌ బ్యారల్‌ 2.6 డాలర్లు ఎగసి 61.27 డాలర్లను తాకగా.. నైమెక్స్‌ చమురు సైతం 2.6 డాలర్లు పెరిగి 52.36 డాలర్లకు చేరింది. ప్రస్తుతం లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ బ్యారల్‌ 0.8 శాతం క్షీణించి 61 డాలర్ల దిగువన కదులుతుంటే.. న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ 1 శాతం వెనకడుగుతో 52 డాలర్ల దిగువకు చేరింది. 

సౌదీ ఎఫెక్ట్‌
అమెరికా ఇంధన నిల్వలు తగ్గడానికితోడు.. అటు చమురు ఉత్పత్తి, ఇటు ఎగుమతులు భారీగా క్షీణించనున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించడంతో చమురు ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు అమెరికా, చైనా మధ్య  వాణిజ్య వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు కనిపించడంతో చమురుకు డిమాండ్‌ పెరగవచ్చన్న అంచనాలు సైతం బలపడినట్లు తెలియజేశారు. 

Image result for opec

బేర్‌ ట్రెండ్‌ నుంచి బౌన్స్‌
గత మూడు నెలల్లో చమురు ధరలు 40 శాతంపైగా పతనమయ్యాయి. అయితే కొత్త ఏడాదిలో తిరిగి యూటర్న్‌ తీసుకున్నాయి. దీంతో గత 8 ట్రేడింగ్‌ సెషన్లలోనే చమురు ధరలు 17 శాతం దూసుకెళ్లాయి. ఈ నెలలో చమురు ఉత్పత్తిని రోజుకి 1.02 కోట్ల బ్యారళ్లమేరకు తగ్గించుకోనున్నట్లు సౌదీ ఇంధన మంత్రి ఖలీద్‌ బుధవారం పేర్కొనడంతో ధరలు ఊపందుకున్నాయి. ధరలను నిలబెట్టేందుకు రష్యాసహా ఒపెక్‌ దేశాలు రోజుకి 1.2 మిలియన్‌ బ్యారళ్లమేర ఉత్పత్తిలో కోత పెట్టేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం విదితమే.

రుపీ వీక్
చమురు ధరలు బలపడటం, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు పుంజుకోవడం వంటి ప్రతికూల అంశాల కారణంగా రూపాయి తిరిగి బలహీనపడుతోంది. కొత్త ఏడాది తొలి వారంలో సాంకేతికంగా కీలకమైన 70 దిగువకు బలపడిన రూపాయి రెండు రోజులుగా నేలచూపులకు లోనవుతోంది. ఈ బాటలో బుధవారం డాలరుతో మారకంలో 25 పైసలు క్షీణించి 70.46 వద్ద ముగిసింది. ఒక దశలో 70.65 వరకూ జారింది. మంగళవారం సైతం రూపాయి 53 పైసలు పతనమై 70.21 వద్ద నిలిచిన సంగతి తెలిసిందే. గత రెండు వారాల్లో చమురు ధరలు దాదాపు 20 శాతం ర్యాలీ చేయడంతో దేశీ కరెన్సీపై ఒత్తిడి పెరుగుతున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. చమురు ధరలు పెరిగితే దిగుమతుల బిల్లు భారమై వాణిజ్య లోటుకు దారితీస్తుందన్న ఆందోళనలు దీనికి కారణమని తెలియజేశారు.Most Popular