తెరా సాఫ్ట్‌- ప్రాజ్‌ - భల్లేభల్లే!

తెరా సాఫ్ట్‌- ప్రాజ్‌ - భల్లేభల్లే!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫైబర్‌నెట్‌(ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌) నుంచి కాంట్రాక్టు పొందినట్లు వెల్లడించడంతో తెరా సాఫ్ట్‌వేర్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. ఈ బాటలో ఆర్థిక పనితీరుపై ఆశావహ అంచనాలతో ప్రాజ్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో లాభాలతో కళకళలాడుతోంది. వివరాలు చూద్దాం....

తెరా సాఫ్ట్‌వేర్‌ 
ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ నుంచి రూ. 325 కోట్ల విలువైన వర్క్‌ ఆర్డర్‌ను పొందినట్లు తెరా సాఫ్ట్‌వేర్‌ తాజాగా పేర్కొంది. భారత్‌నెట్‌ రెండో దశలో భాగంగా ఆప్టికల్‌ ఫైబర్‌ గ్రిడ్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయవలసి ఉంటుందని తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా 3394 గ్రామ పంచాయతీలలో ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను సమకూర్చవలసి ఉంటుందని తెలియజేసింది. ఏడాదిలోగా ప్రాజెక్టును పూర్తిచేయవలసి ఉండగా..  ఏడేళ్లపాటు నిర్వహణ చేపట్టవలసి ఉంటుందని వివరించింది. ఐటీ సొల్యూషన్స్‌ అందించే ఈ కంపెనీలో ప్రమోటర్లకు 47.45 శాతం వాటా ఉంది. కాగా.. కాంట్రాక్ట్‌ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో తెరా సాఫ్ట్‌వేర్‌ షేరు రూ. 9 ఎగసి రూ. 52.50 వద్ద ఫ్రీజయ్యింది.

Related image

ప్రాజ్‌ ఇండస్ట్రీస్‌
ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతోపాటు.. ఇకపై మరింత పటిష్ట పనితీరును చూపవచ్చన్న అంచనాల నడుమ ప్రాజ్‌ ఇండస్ట్రీస్ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 134 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 137 సమీపంలో 52 వారాల గరిష్టాన్ని తాకింది. 

రూ. 900 కోట్లు
ఈ సెప్టెంబర్‌కల్లా ప్రాజ్ ఆర్డర్‌బుక్‌ విలువ రూ. 900 కోట్లను తాకింది. వీటిలో ప్రధానంగా క్యూ2లోనే 76 శాతం అధికంగా రూ. 338 కోట్ల ఆర్డర్లను పొందింది. ఇటీవల షుగర్‌ మిల్లులు ఇథనాల్‌ ఉత్పత్తిపై మరింతగా దృష్టిసారించడంతో కంపెనీకి అవకాశాలు పెరగనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ఈ సీజన్‌లో 11.5 మిలియన్‌ టన్నుల స్థాయిలో చక్కెర నిల్వలు నమోదుకానున్నట్లు అంచనా. దీంతో షుగర్‌ మిల్లులు మొలాసిస్‌ నుంచి ఇథనాల్‌ తయారీకి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.  Most Popular