జెట్ ఎయిర్ వేస్‌ బోర్డు నుండి నరేష్‌ గోయల్ వైదొలగనున్నారా...? 

జెట్ ఎయిర్ వేస్‌ బోర్డు నుండి నరేష్‌ గోయల్ వైదొలగనున్నారా...? 

రుణ భారం, నిర్వాహణ వ్యయాలు పెరగడం, నష్టాలు వంటి సమస్యలతో సతమతమౌతున్న నరేష్ గోయల్ కు చెందిన జెట్ ఎయిర్ వేస్ తన నిధుల సమీకరణ యత్నాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా ఈ సంస్థకు రుణాలు ఇచ్చిన బ్యాంకుల కన్సార్టియం హెడ్ SBI దాదాపు 900 మిలియన్ డాలర్ల  పరిష్కార రుణ ప్రతిపాదనను తెచ్చింది. అయితే.. ఇది సాధ్యం కావాలంటే.. జెట్ ఎయిర్ వేస్ ఫౌండర్, ఛైర్మన్ అయిన నరేష్ గోయల్ తన వాటాలను 26శాతానికి తగ్గించుకోవాల్సి ఉంటుంది. జెట్ ఎయిర్ వేస్‌లోని వాటా దారులందరూ.. నరేష్ గోయెల్ బోర్డు నుండి తప్పుకోడమే మేలని సూచించడం ఇక్కడ గమనార్హం. జెట్ ఎయిర్ వేస్‌కు ప్రస్తుతం $450 మిలియన్ డాలర్ల రుణ భారం ఉంది. గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జీలు పెరిగి పోవడం, ఉద్యోగులకు జీత భత్యాలను కూడా చెల్లించలేని పరిస్థితి రావడంతో రుణ పునర్వవస్థీకరణకు జెట్ కంపెనీ బోర్డు  ఎస్బీఐ ముందు తన ప్రతిపాదనలను ఉంచింది. జనవరి 8 న బ్యాంకుల కన్సార్టియమ్ తో జరిగిన సమావేశంలో బ్యాంకు ప్రతినిధులతో బాటు జెట్ ఛైర్మెన్ నరేష్ గోయెల్, కంపెనీలో 24శాతం వాటాను కలిగి ఉన్న ఎతిహాద్ ఎయిర్ లైన్స్ ప్రతినిధి కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో $900మిలియన్ డాలర్ల రుణ పునర్వవస్థీకరణకు SBI ప్రతిపాదించిన ప్లాన్‌కు బోర్డు సభ్యులు, వాటాదారులు ఆసక్తి చూపినట్టు సమాచారం. అయితే.. ఇది అమల్లోకి రావాలంటే.. ఛైర్మన్ నరేష్ గోయెల్ బోర్డు నుండి వైదొలగాల్సి ఉంటుందని, నాన్ ఎగ్జిక్యూటివ్ హోదాలో జెట్‌ ఎయిర్ వెస్ కు సేవలందించవచ్చని అత్యధిక వాటాదారులు అభిప్రాయపడినట్టు సమాచారం. జెట్ ఎయిర్ వేస్‌లో ప్రస్తుతం నరేష్ గోయెల్ 51శాతం వాటాను కలిగిఉన్నారు. ఎస్బీఐ ప్రతిపాదనకు ఓకే చెప్పాలంటే.. గోయెల్ తన కున్న వాటాలను తగ్గించుకోవాల్సి ఉంటుందని బోర్డు వర్గాలు అంటున్నాయి. ఒక వేళ SBI ప్రతిపాదనకు బోర్డు సమ్మతిస్తే.. నరేష్ గోయెల్ తన వాటాలను దాదాపు సగానికి పైగా కోల్పోనున్నారు. అదే సమయంలో జెట్ ఎయిర్ వేస్‌లో SBI 20శాతం వాటాలను హోల్డ్ చేస్తుందని తెలుస్తుంది. బోర్డు  నుండి నరేష్‌ గోయెల్ వైదొలగితే.. ఆస్థానంలో అతని కుటుంబం నుండి మరో వ్యక్తి డైరెక్టర్‌గా రావొచ్చని మీడియా వర్గాలు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఇప్పటికే ఎతిహాద్ సంస్థతో నరేష్ గోయెల్ చర్చలు జరుపుతున్నారని, దాదాపు 450 మిలియన్ డాలర్లను జెట్ ఎయిర్ వేస్‌లోకి కొత్తగా మళ్ళించే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారని , అదే జరిగితే.. మిగతా 450 మిలియన్ డాలర్ల నిధులను మిగతా దేశీయ వాటా దారుల నుండి సమీకరించుకోవాల్సి వస్తుందని  మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ జనవరి 1 నాటికి జెట్ ఎయిర్ వేస్ బ్యాంకులకు తిరిగి చెల్లించాల్సిన రుణ చెల్లింపులను చేయలేక పోయింది. ఎతిహాద్ సంస్థ నిర్వాహణ ఖర్చులు, రుణ చెల్లింపుల కోసం 150 మిలియన్ డాలర్లను అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. రానున్న రెండేళ్ళల్లో ఆపరేటింగ్ కాస్ట్  రూ. 2000 కోట్లను తగ్గించుకునేందుకు జెట్ ఇప్పటికే చర్యలను చేపట్టింది. విమానాల్లో ప్రయాణీకులకు అందించే ఫ్రీ మీల్స్ ను నిలిపివేయడం, లాభాలు లేని రూట్లలో విమానాలను నిలిపివేయడం వంటి చర్యలను తీసుకుంది. అంతే కాకుండా రుణ చెల్లింపుల కోసం మరో రూ. 3500 కోట్ల నిధుల సమీకరణకు కూడా యత్నిస్తుంది. తన విదేశీ వాటా దారులకు ఈ విషయాన్ని ఇప్పటికే తెలియజేసింది జెట్ ఎయిర్ వేస్. ఇందులో భాగంగానే  ' జెట్ ప్రివిలేజ్ '  పేరిట కొత్త వాటాలను విక్రయానికి పెట్టింది. 

 Most Popular