నేలచూపు వీడని రూపాయి

నేలచూపు వీడని రూపాయి

వరుసగా రెండో రోజు దేశీ కరెన్సీ వెనకడుగు వేస్తోంది. అయితే డాలరుతో మారకంలో తొలుత 16 పైసలు పుంజుకుంది ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో 70.05 వద్ద ప్రారంభమైంది. తదుపరి ఉన్నట్టుండి బలహీనపడింది. ప్రస్తుతం 22 పైసలు(0.33 శాతం) క్షీణించి 70.43 వద్ద ట్రేడవుతోంది. సోమవారం నామమాత్రంగా బలపడిన రూపాయి మంగళవారం తిరిగి 53 పైసలు పతనమైంది. 70.21 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 70.23-69.83 మధ్య ఊగిసలాడింది. 

కారణాలేవిటంటే
ముడిచమురు ధరలు మళ్లీ పుంజుకోవడంతో వాణిజ్య లోటు పెరగవచ్చన్న అంచనాలు దేశీ కరెన్సీని దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మంగళవారం దాదాపు రూ. 554 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించడం కూడా డాలర్లకు డిమాండ్‌ను పెంచినట్లు తెలియజేశారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారం దిశగా జరుగుతున్న చర్చలు ఫలవంతమయ్యే సంకేతాలతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలపడింది. ఇది కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. Most Popular