రేట్ల పెంపు- ప్రింట్‌ మీడియా జూమ్‌

రేట్ల పెంపు-  ప్రింట్‌ మీడియా జూమ్‌

ప్రోత్సాహకర ప్రపంచ సంకేతాల నడుమ హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లలో తాజాగా ఇన్వెస్టర్లు ప్రింట్‌ మీడియా కౌంటర్లవైపు దృష్టిసారించారు. కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రింట్‌ మీడియా కౌంటర్లు భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. ఇందుకు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటనల ధరలను 25 శాతంమేర పెంచడమే కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం..

షేర్ల జోరు
ప్రింట్‌ మీడియాకు విడుదల చేసే ప్రకటనల రేట్లను 25 శాతంమేర పెంచేందుకు బ్యూరో ఆఫ్‌ ఔట్‌రీచ్‌ కమ్యూనికేషన్స్‌ నిర్ణయించినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రింట్‌ ప్రకటనల రేట్లను పెంచడం ద్వారా దేశవ్యాప్తంగా పలు మధ్య, చిన్నతరహా న్యూస్ పేపర్‌ సంస్థలు లబ్ది పొందనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ పేర్కొంది. ప్రధానంగా ప్రాంతీయ భాషల దినపత్రికలకు మేలు చేకూరనున్నట్లు తెలియజేసింది. ఇంతక్రితం 2013లో ప్రకటనల రేట్లను ప్రభుత్వం 19 శాతంమేర పెంచింది. దీంతో ఒక్కసారిగా ప్రింట్‌ మీడియా షేర్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌టీ మీడియా 16 శాతం దూసుకెళ్లి రూ. 45.5 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో జాగరణ్‌ ప్రకాశన్‌ 6 శాతం జంప్‌చేసి రూ. 122కు చేరింది. ఇంట్రాడేలో రూ. 125 వరకూ ఎగసింది. ఇక డీబీ కార్ప్‌ సైతం 6 శాతం పురోగమించి రూ. 179 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 183 వరకూ  పెరిగింది.Most Popular