లాభాల ఓపెనింగ్‌ చాన్స్‌ నేడు?! 

లాభాల ఓపెనింగ్‌ చాన్స్‌ నేడు?! 

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు లాభాల(గ్యాపప్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 81 పాయింట్లు జంప్‌చేసి 10,918 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌, సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌, ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ జోరందుకోవడంతో మంగళవారం మరోసారి అమెరికా స్టాక్ మార్కెట్లు 1 శాతంపైగా ఎగశాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కార చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో సెంటిమెంటు మెరుగుపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. మంగళవారం యూరోపియన్‌ మార్కెట్లు సైతం 0.5-1 శాతం మధ్య పుంజుకోగా... ప్రస్తుతం ఆసియాలో అన్ని మార్కెట్లూ లాభాల దౌడు తీస్తున్నాయి. దీంతో నేడు దేశీయంగానూ మార్కెట్లు లాభాల మధ్య కదిలే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

Image result for share trading india

రెండో రోజూ
సానుకూల ప్రపంచ సంకేతాల నేపథ్యంలో మంగళవారం పడుతూ... లేస్తూ కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి చెప్పుకోదగ్గ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 131 పాయింట్లు ఎగసి 35,981 వద్ద నిలవగా.. నిఫ్టీ సైతం 30 పాయింట్లు పుంజుకుని 10,802 వద్ద స్థిరపడింది. మిడ్‌సెషన్‌ నుంచీ కొనుగోళ్లు పెరగడంతో సెన్సెక్స్‌ ఇంట్రాడేలో సాంకేతికంగా కీలకమైన 36,000 పాయింట్ల మైలురాయిని మరోసారి అధిగమించింది. 

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 10,751 పాయింట్ల వద్ద, తదుపరి 10,699 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 10,836 పాయింట్ల వద్ద, తదుపరి 10,870 స్థాయిలోనూ అవరోధాలు ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 27,267 వద్ద, తదుపరి 27,024 వద్ద సపోర్ట్‌ కనిపించవచ్చని... మరోవైపు 27647, 27785 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని అంచనా వేశారు.
   
ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 534 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 698 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. కాగా.. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 736 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌ రూ. 142 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. Most Popular