మార్కెట్లకు మందగమన భయాలు

మార్కెట్లకు మందగమన భయాలు

అమెరికా చైనా మధ్య వాణిజ్య వివాదాలు ప్రపంచ ఆర్థిక మందగమనానికి దారిచూపనున్న అంచనాలు ఇటీవల ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీస్తూ వస్తున్నాయి. ప్రధానంగా 2019లో కార్పొరేట్‌ ఫలితాలు నిరాశపరచనున్న అంచనాలు అమెరికా మార్కెట్లలో బేర్‌ట్రెండ్‌కు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది తొలి రోజు ఆందోళనకు లోనైన అమెరికన్‌ ఇన్వెస్టర్లు డోజోన్స్‌ ఫ్యూచర్స్‌లో అమ్మకాలకు ఎగబడ్డారు. దీంతో దేశీంయగానూ ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి మిడ్‌ సెషన్‌ నుంచీ దేశీ మార్కెట్లు కంగుతిన్నాయి. సెన్సెక్స్‌ 363 పాయింట్లు పతనమై 35,891 వద్ద నిలవగా... నిఫ్టీ 118 పాయింట్లు కోల్పోయి 10,792 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ మరోసారి సాంకేతికంగా కీలకమైన 36,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరింది.  

మెటల్; ఆటో దెబ్బ
ఇప్పటికే మందగమన బాట పట్టిన చైనాలో గత మూడు నెలల్లో హాట్‌ రోల్డ్‌కాయిల్స్‌ ధరలు 15 శాతంవరకూ పతనమయ్యాయి. ఈ ప్రభావంతో మెటల్‌ స్టాక్స్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీనికితోడు దేశీయంగా డిసెంబర్‌ నెలలో వాహన అమ్మకాలు నిరాశనపచడంతో సెంటిమెంటుకు షాక్‌తగిలినట్లు నిపుణులు చెబుతున్నారు. వెరసి ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ 3.5 శాతం, ఆటో 3 శాతం చొప్పున పతనమయ్యాయి. ఈ బాటలో పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ సైతం 2-1.5 శాతం చొప్పున డీలాపడ్డాయి. 

Image result for share investors india

బ్లూచిప్స్‌ దిగాలు
ఎన్‌ఎస్ఈలో అన్ని రంగాలూ నష్టపోయాయంటే అమ్మకాల ఊపును అర్ధం చేసుకోవచ్చు. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్‌ 9.4 శాతం కుప్పకూలగా.. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, వేదాంతా, ఎంఅండ్ఎం, హిందాల్కో, హీరోమోటో,  గెయిల్‌, బీపీసీఎల్‌, టాటా మోటార్స్‌ 5.5-3 శాతం మధ్య పతనమయ్యాయి. కేవలం సన్‌ ఫార్మా, ఇన్‌ఫ్రాటెల్‌, టీసీఎస్, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌ 1.5-0.5 శాతం మధ్య బలపడ్డాయి. 

మిడ్‌ క్యాప్స్‌ బోర్లా
మార్కెట్లు ఒక్కసారిగా పతనబాట పట్టడంతో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌లోనూ అమ్మకాలు నమోదయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1.25-0.75 శాతం చొప్పున నీరసించాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1593 నష్టపోగా.. 954 మాత్రమే లాభాలతో ముగిశాయి. 

డీఐఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 48 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయిస్తే..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 142 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేశాయి. సోమవారం సైతం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 327 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌ రూ. 322 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే.Most Popular