2018 ఆటాడించింది.. మరి 2019 ఎలా ఉండబోతోందో తెలుసా ?

2018 ఆటాడించింది.. మరి 2019 ఎలా ఉండబోతోందో తెలుసా ?

2018 మదుపర్లను నిరాశలో ముంచి వేసింది. మరి రానున్న 2019 సంవత్సరం ఎలా ఉండబోతుంది.మదుపర్లకు లాభాలు అందని ద్రాక్షలు గా మిగిలిపోయిన నేపథ్యంలో రానున్న సంవత్సరమైనా సానుకూల ఫలితాలను ఇస్తుందా..? 2018 క్యాలెండర్ స్టాక్ మార్కెట్‌కు ఏమాత్రం కలిసిరాలేదనే చెప్పాలి. ఒక దాని తరువాత మరొకటిలా ఎదో ఒక ఉపద్రవం దేశీయ స్టాక్ మార్కెట్లను వెంటాడుతూనే ఉంది. సంవత్సర ఆరంభంలో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల.., ఆ తరువాత రూపీ క్షీణత, దాని తరువాత IL&SF సంక్షోభం, NBFCల వైఫల్యాలు, నగదు కొరత, ఇవ్వన్నీ సద్దుమణిగాయనుకుంటే.. ఈ లోపు అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం, దీనికీ కాస్త గ్యాప్ ఇచ్చారనుకుంటున్నంత లోపే.. అమెరికా షట్ డైన్ వంటి పరిణామాలు దేశీయ మార్కెట్లను ప్రభావితం చేశాయి. 2018 ఆగస్టు నెల ఒక్కటే .. కాస్త మార్కెట్లకు ఉపశమనం కలిగించింది. సన్సెక్స్ , నిఫ్టీ గరిష్ట స్థాయికి చేరడం ఒక్కటే చెప్పుకోదగ్గదిగా ఉంది. ఆ తరువాత మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ పతనం కావడంతో మదుపర్ల సంపద లక్షల కోట్లలో ఆవిరైంది. అంతర్జాతీయంగా కూడా పలు దేశాల్లో స్టాక్ మార్కెట్లు పెద్ద ఎత్తున పతనం దిశగా పయనించాయి. కొన్ని దేశాల్లో ఆయా రిజర్వ్ బ్యాంకులు మార్కెట్ల పతనాన్ని అడ్డుకోడానికి యత్నించాయి. సెంట్రల్ బ్యాంకులు దేశ ఆర్ధిక వ్యవస్థను కాపాడ్డానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించాయి. ఈ సంవత్సరం స్థూల పారామీటర్స్ క్షీణించడం, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, లిక్విడిటీ సమస్యలు , బాండ్ల అమ్మకాల వంటివి మార్కెట్ సెంటిమెంట్‌ను నాశనం చేశాయి. వీటిలో ఈ సంవత్సరం చివరినాటికి ఒక్క క్రూడ్ ఆయిల్ ధరలే కొంచెం దిగిరావడం శుభ పరిణామం. గత అక్టోబర్‌లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $80 డాలర్లు ఉండగా, ఈ డిసెంబర్‌ చివరి నాటికి $50 డాలర్లకు దిగి వచ్చింది. ఇరాన్‌ పై విధించిన అమెరికన్ ఆంక్షలు కాస్త సడలించడంతో.. 2019 నుండి ఇరాన్ నుండి ఎగుమతులు పెరగొచ్చు. దీంతో ముడి చమురు ధరలు ఇంకా దిగి రావొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. 
ఇక దేశీయ స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే.. పలు స్టాక్స్ నష్టాల బాటలోనే ఉన్నా.. 2018లో సుమారు $4.58 బిలియన్ డాలర్ల పెట్టుబడులు మార్కెట్ నుండి తరలి వెళ్ళిపోయాయి. ఈ దశాబ్ద కాలంతో లెక్కిస్తే.. ఇదే అత్యధికం. కానీ..ఈ విషయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు మార్కెట్లను ఆదుకున్నారు. దేశీయ ఆర్ధిక పెరుగుదలతో బాటు దేశీ మదుపర్లు కూడా క్రమంగా పెరుగుతారని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. 
రాబోయే 2019 సంవత్సరంలో పెట్టుబడి దారులు, ఫారిన్ ఇన్వెస్టర్లు అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం ఎలా ఉండబోతుందా అని ఎదురు చూడబోతున్నారు. వారి పెట్టుబడులకు పలు మేజర్ బ్యాంకుల ఆర్ధిక సరళీకరణ, గ్లోబల్ జీడీపీ వృద్ధి రేటు నెమ్మదించడం అనే అంశాలు ప్రతికూలంగా మారొచ్చు. దేశీయ స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే.. రాబోయే సంవత్సరంలో ఆర్బీఐ తీసుకోబోయే వడ్డీ రేట్ల నిర్ణయాలు,  సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కార్పోరేట్ ఎర్నింగ్న్స్‌పై ప్రభావం చూపనున్నాయి. 2019లో జరగనున్న సెంట్రల్ ఎలక్షన్లు మార్కెట్లను ఖచ్చితంగా ప్రభావితం చేయనున్నాయి. 
ఏది ఏమైనప్పటికీ.. రానున్న 2019 సంవత్సరం దేశీయ మార్కెట్లలలో మిశ్రమ ఫలితాలు చూపించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్ధిక వ్యవస్థ ప్రాధమిక విలువలు, ట్యాక్స్ రాబడి పెరుగుదల, ఆర్ధిక పురోగమనం వంటి అంశాలు మార్కెట్లను ముందుకు నడిపించవచ్చు. 

 Most Popular