కొత్త సంవత్సరంలో ..ఆర్ధిక మాంద్యం రానుందా..? 

కొత్త సంవత్సరంలో ..ఆర్ధిక మాంద్యం రానుందా..? 

2018 సంవత్సరం ఇన్వెస్టర్లకు ఎటూ కలిసిరాకపోగా.. 2019 కూడా ఎలా ఉంటుందో అని గ్లోబల్ ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. గత నాలుగు వారాలుగా అమెరికా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతుండగా.. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనంగా మారింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలోనూ ఫారిన్ ఇన్వెస్టర్లు సంతోషంగా లేరు. గ్లోబల్ మార్కెట్లు పలు అంశాల్లో ప్రభావితం అవుతుండటంతో ఆర్ధిక మాంద్యం రానుందా అని మదుపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Image result for crude oil
క్రూడ్ ఆయిల్ ధరలు: 
ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్యారల్ క్రూడ్‌ ఆయిల్ ధర 50 డాలర్లకు పడిపోయింది. ఇదే అదనుగా స్టాక్ మార్కెట్లలోని పెట్టుబడులు బులియన్ మార్కెట్ల వైపు మళ్లడంతో మార్కెట్లు కుప్పకూలసాగాయి. మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా సాగుతోందని నిపుణులు వేస్తున్న అంచనాలు ఇన్వెస్టర్లు  ఆందోళన చెందడంతో పలు కౌంటర్లలో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండు నెలలుగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు పతనం కావడం, ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తులపై స్వీయ నియంత్రణ విధించుకోడం, ఇరాన్‌పై అమెరికా చమురు ఆంక్షలు వంటి అంశాలు మార్కెట్లను తీవ్ర ప్రభావితం చేశాయి. 

Image result for christmas stock markets
వర్క్‌ అవుట్ కాని క్రిస్మస్ సెంటిమెంట్ ..
సాధారణంగా ఇయర్ ఎండింగ్‌లో క్రిస్మస్‌ సెంటిమెంట్‌తో యూఎస్ మార్కెట్లు లాభాల్లోకి వస్తాయి. కానీ.. ఈ క్రిస్మస్ ఆ సెంటిమెంట్‌ను పాటించలేదు. క్రూడ్ ఆయిల్ ధరల పతనం, అమెరికాలోని ఆర్ధిక కార్యకలాపాల షట్ డౌన్ , చైనా అమెరికా ట్రేడ్ వార్ వంటి అంశాలు మదుపర్లను లాభాల స్వీకరణకే మొగ్గు చూపేలా చేసింది. దాంతో లిక్విడిటీ ఫ్లో లేక పలు స్టాక్ కౌంటర్లు అమ్మకాల ఒత్తిళ్ళకు లోనయ్యాయి. క్రిస్మస్ సెలవు తరువాత స్టాక్ మార్కెట్లలో సెంటిమెంట్ పూర్తిగా బలహీనపడింది.  అమెరికా మార్కెట్ల పతనం తరువాత, తూర్పు ఆసియా దేశాల సూచీలు సైతం నష్టపోవడంతో దేశీయంగా సెన్సెక్స్, నిఫ్టీలు దిగజారాయి.

Image result for 2019 elections
2019 ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి..
దేశీయ మార్కెట్లకు 2018 కలిసిరాలేదనే చెప్పాలి. రానున్న 2019 వేసవి తరువాత సార్వత్రిక ఎన్నికలు ఉండటం, అందునా.. సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందా లేదో అన్న భయాలు వంటివి మార్కెట్లను ప్రభావితం చేయొచ్చు. అంతే కాకుండా కొత్త ఆర్బీఐ గవర్నర్ కూడా ఎన్నికల తరువాతే క్రియాశీలంగా మారే అవకాశం ఉందన్నది మార్కెట్ వర్గాల అంచనా. ద్రవ్యోల్బణం అదుపుకు ఆర్బీఐ తీసుకోనున్న చర్యలు కూడా ఎలక్షన్ల తరువాతే ప్రారంభం కావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్ల ప్రభావం, 2019లో సంకీర్ణం ఎర్పడినా.. (సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే) దేశీయంగా మార్కెట్లు కుప్పకూలడం ఖాయమని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.

 Image result for bullion market
ఊరిస్తున్న బులియన్ మార్కెట్లు:
అంతర్జాతీయంగా కూడా బులియన్ మార్కెట్లు పుంజుకుంటున్నాయి. సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బులియన్ మార్కెట్లకు తరలిస్తున్నారు. బుధవారం నాడు బంగారం ధర 10 గ్రాములకు క్రితం ముగింపుతో పోలిస్తే 0.23 శాతం పెరిగి రూ. 31,531కి చేరుకుంది. ఇది మరింత పెరగనుందని బులియన్ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే  కిలో వెండి ధర 0.21 శాతం పెరిగి 37,621కి చేరుకుంది. అంతర్జాతీయంగా గోల్డ్ డిమాండ్ పెరగడం, భారత దేశంలో రానున్న పండుగల సీజన్‌ కూడా ఆశాజనకంగా ఉండటంతో బంగారం మీద పెట్టుబడులు సురక్షితం అన్న భావనలో మదుపర్లు ఉన్నారని PC జ్యూయల్‌రీస్ సంస్థ పేర్కొంది. 

Image result for rupee doller
రూపీ మారకపు విలువ;
గత వారం రూపీ మారకపు విలువ డాలర్‌తో పోలిస్తే.. 10శాతం నష్టపోయింది. నేటి మార్కెట్లలో రూపీ -0.21శాతం నష్టపోయి రూ. 69.99 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా గ్లోబల్ మార్కెట్ల పరిణామాలు గమనిస్తే.. రానున్న కొత్త సంవత్సరంలో రూపీ మారకపు విలువ డాలర్‌తో పోలిస్తే.. రూ. 74.25 నుండి రూ. 70.15 వరకూ ఉండొచ్చని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇది భారతీయ ఎగుమతుల మీద ప్రభావం చూపనుందని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. 
అంతర్జాతీయంగా ఆర్ధిక మాంద్య భయాలున్నప్పటికీ.. దేశీయ మార్కెట్లు నిలదొక్కుకుంటాయన్న ఆశాభావాన్ని ఎనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లలోని బేరిష్ ట్రెండ్ ఎంతో కాలం సాగదని.. త్వరలోనే మళ్లీ లాభాల సముపార్జన సాధ్యమేనని ప్రముఖ ఇన్వెస్టర్‌ పోరింజు వెలియాత్ అంటున్నారు. మిడ్ క్యాప్, IT రంగాలు పుంజుకోనున్నాయని.. అవి మరింత ఆకర్షణీయంగా మారొచ్చని ఆయన పేర్కొన్నారు. 

 మార్కెట్ పరిస్థితి  ఇలా ఉంది..
బుధవారం నాటి ఉదయం సెన్సెక్స్ 400 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లకు పైగా పడిపోయాయి. ఉదయం 11 గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్, క్రితం ముగింపుతో పోలిస్తే, 342 పాయింట్ల నష్టంతో 35,127 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ, 94.35 పాయింట్ల నష్టంతో 10,569 పాయింట్ల వద్దా కొనసాగాయి. BSE-30లో ఆసియన్ పెయింట్స్, హీరో మోటోకార్ప్, ఐటీసీలు మాత్రమే లాభాల్లో నడుస్తుండగా, మిగతా కంపెనీలన్నీ నష్టపోయాయి. యస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, రిలయన్స్, ఓఎన్జీసీ తదితర కంపెనీలన్నీ నష్టాలనే నమోదు చేశాయి. కాగా ఇంట్రాడేలో సాయంత్రానికి నిఫ్టి కొద్దిగా కోలుకుని 0.13శాతం పెరుగుదలతో 10,677.35 వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ స్వల్ప నష్టంతో ఉదయంతో పోలిస్తే.. 315 పాయింట్లు పుంజుకుని  35,450 వద్ద ట్రేడ్ అవుతుంది.మార్కెట్ల అస్థిరతతో రానున్న కొత్త సంవత్సరం ఆర్ధిక మాంద్యం దిశగా కదలబోతుందా అని ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  
కాగా, బుధవారం నాటి ఆసియా మార్కెట్లలో నిక్కీ 0.95 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 1.41 శాతం, హాంగ్ సెంగ్ 0.40 శాతం, తైవాన్ వెయిటెన్డ్ 0.28 శాతం, కోస్పీ 1.83 శాతం, సెట్ కాంపోజిట్ 0.43 శాతం, జకార్తా కాంపోజిట్ 0.24 శాతం, షాంగై కాంపోజిట్ 0.24 శాతం నష్టపోయాయి.

 Most Popular