భెల్‌ లిథియం బ్యాటరీలు? ఆర్‌ఈసీ అప్‌!

భెల్‌ లిథియం బ్యాటరీలు? ఆర్‌ఈసీ అప్‌!

విభిన్న కారణాలతో పీఎస్‌యూ దిగ్గజాలు బీహెచ్‌ఈఎల్‌, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌  కార్పొరేషన్(ఆర్‌ఈసీ) లిమిటెడ్‌ కౌంటర్లు నష్టాల మార్కెట్లోనూ జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో లాభాలతో సందడి చేస్తున్నాయి. లిథియం అయాన్‌ బ్యాటరీ తయారీలోకి ప్రవేశించనున్న వార్తలతో భెల్‌, ట్రాన్స్‌మిషన్‌ సంస్థలో వాటాను పవర్‌గ్రిడ్‌కు విక్రయించిన వార్తలతో ఆర్‌ఈసీ వెలుగులోకి వచ్చాయి. ఇతర వివరాలు చూద్దాం...

భెల్‌ లిమిటెడ్‌
విద్యుత్‌ ప్లాంట్ల ఉపకరణాల తయారీ దిగ్గజం బీహెచ్‌ఈఎల్‌ లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీలోకి ప్రవేశించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఈ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 3 శాతం పెరిగి రూ. 72 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 73 వద్ద గరిష్టాన్నీ, రూ. 70 దిగువన కనిష్టాన్నీ తాకింది. దేశీయంగా లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీపై దృష్టిపెట్టినట్లు కేంద్ర మంత్రి అనంత్‌ గీతే తాజాగా పేర్కొన్నారు. ఇందుకు భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేసే అంశంపై యూఎస్‌ కంపెనీతో భెల్‌ చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో భెల్‌ కౌంటర్‌కు జోష్‌వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.

Related image

ఆర్‌ఈసీ లిమిటెడ్‌
జవహర్‌పూర్- ఫిరోజాబాద్‌ ట్రాన్స్‌మిషన్‌ లిమిటెడ్‌లో మొత్తం వాటాను పీఎస్‌యూ దిగ్గజం పవర్‌గ్రిడ్‌కు బదిలీ చేసినట్లు వెల్లడించడంతో ఆర్‌ఈసీ లిమిటెడ్‌ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఆర్‌ఈసీ షేరు 3 శాతం జంప్‌చేసి రూ. 113 వద్ద ట్రేడవుతోంది. సొంత అనుబంధ సంస్థ ఆర్‌ఈసీ ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్ట్‌లో పూర్తి వాటాను పవర్‌గ్రిడ్‌కు బదిలీ చేసినట్లు ఆర్‌ఈసీ పేర్కొంది. కాగా.. గతేడాది తమ టర్నొవర్‌, నెట్‌వర్త్‌లలో ఈ సంస్థ వాటా నామమాత్రమేనని ఆర్‌ఈసీ తెలియజేసింది. Most Popular